బోధన్, ఆగస్టు 24: బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద షాక్ తగలనున్నది. కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్లు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
బాన్సువాడ నియోజకవర్గంలోని కొందరు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రధానంగా కోటగిరి, పొతంగల్, వర్ని, రుద్రూర్, చందూర్, మోస్రా మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్‌కు తరలివెళ్లనున్నట్లు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. బీఆర్ఎస్లో చేరనున్నవారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి శ్రీనివాస్‌రావు, కోటగిరి మాజీ ఎంపీపీ చైర్మన్ వల్లేపల్లి శ్రీనివాస్‌రావు, కోటగిరి మండల కేంద్రానికి చెందిన తేళ్ల రవికుమార్, రుద్రూర్ సొసైటీ మాజీ చైర్మన్ ఎంవీ గంగారాం తదితరులు ఉన్నారు.
బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గానికి చెందిన యలమంచిలి శ్రీనివాస్‌రావు బీఆర్ఎస్లో చేరుతుండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం యలమంచిలి శ్రీనివాస్‌రావు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లోకి ఈ నెల 28న కేటీఆర్ సమక్షంలో పెద్ద సంఖ్యలో చేరికలకు సన్నాహాలు జరుగుతున్నాయి.