ఖలీల్‌వాడి, అక్టోబర్ 16: బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 30వ డివిజన్‌కు చెందిన నాయకుడు మతీన్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది యువకులు గురువారం అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి బిగాల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బిగాల మాట్లాడుతూ.. తాము అధికారంలో లేకున్నా, తాము ఉన్నామంటూ బీఆర్ఎస్కు అండగా నిలిచిన నాయకులను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో పార్టీ వెంట నడిచిన పలువురు అధికార దాహంతో ఇతర పార్టీల్లో చేరారని, వారు తన దృష్టిలో గాడిదలతో సమానమని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇప్పటి వరకూ ఒక్కపని మొదలు కాలేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
ప్రస్తుత అర్బన్ ఎమ్మెల్యే తన చేతిలో ఏమీలేదని, ప్రభుత్వం నిధులు కేటాయిస్తేనే తాను ఏదైనా చేయవచ్చని చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. బడా నేతలుగా చెప్పుకునే కొందరు తమ స్వలాభం కోసం నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ అయ్యారు తప్ప ప్రజలకు ఏం అవసరమో గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు. తాగడానికి నీరు కూడా ఇవ్వని దౌర్భాగ్యమైన ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇప్పడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అర్బన్ నియోజకవర్గం స్వర్ణ భూమిని తలపించిందని, నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నగరం మొత్తం విద్యుద్దీపాలు వెలిగేవని, ప్రస్తుతం ఒక ప్రాంతంలో విద్యుత్ దీపాలు వెలిగితే మరో ప్రాంతంలో అంధకారం అలుమకుంటున్నదని తెలిపారు. కార్యకర్తలు, నాయకులను పార్టీ కండ్లల్లో పెట్టుకొని చూసుకుంటున్నదని చెప్పారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీదే అధికారమని, కార్యకర్తలు, నాయకులు ఎలాంటి ఆందోళన చెందవద్దని బిగాల ధైర్యం చెప్పారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకుడు దండు శేఖర్, సుజిత్‌సింగ్ ఠాకూర్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.