ఖలీల్‌వాడి/నందిపేట్, సెప్టెంబర్ 12: ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే దౌర్జన్యాలు.. కాంగ్రెస్ పాలనకు ఇవే గీటురాళ్లు! బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండా లు దాడి చేయడం, న్యాయం చేయమని సీపీ ఆఫీస్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలను అరెస్టు చేయడంపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి.
బాధితుల వైపు నిలబడాల్సిన పోలీసులు వారినే అరెస్టు చేసి గంటల తరబడి రోడ్ల మీద తిప్పడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ చెప్పే ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ప్రశ్నిస్తే దాడు లు చేస్తారా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, జిల్లాలో బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం కలకం రేపింది. బాన్సువాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్‌ను గురువారం రాత్రి పోలీలు అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు.
రాష్ట్రంలో గాంధీ పాలన కాదు. గాడ్సే పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ గూండాల దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇందిరమ్మ హయాంలో దేశంలో ప్రకటిత ఎమర్జెనీ విధిస్తే, రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరగుతున్న దాడులు రేవంత్‌రెడ్డి సర్కార్ దురాగతాలకు నిదర్శనమని, ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. కూకట్పల్లి నుంచి గూండాలు, రౌడీషీటర్లతో కలిసి 20 కార్లలో అరికేపూడి గాంధీ కౌశిక్‌రెడ్డిపై హత్యాయత్నం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. రూల్ ఆఫ్ లా ఉల్లంఘనలకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాసిన పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నామని, వచ్చేది కేసీఆర్ పాలనేనని, అప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని జీవన్‌రెడ్డి హెచ్చరించారు. అరికేపూడి గాంధీతోపాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడాన్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు దాదన్నగారి మధుసూదన్‌రావు ఖండించారు. ప్రజాపాలన అంటూ ప్రజాస్వామ్య విరుద్ధంగా పాలన చేస్తున్న కాంగ్రెస్‌కు సమాధి కట్టే రోజు దగ్గరలోనే ఉందనారు