ముప్కాల్, మే 29: అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక, నియంత పాలన కొనసాగుతున్నదని డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ మెండోరా మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముప్కాల్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు నర్స య్య..కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతోపాటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్‌రెడ్డి అక్రమాలపై సోషల్‌మీడియా వేదికగా ప్రశ్నించారు.
దీంతో నర్సయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశా రు. దీనిని నిరసిస్తూ, నర్సయ్యకు మద్దతు తెలియజేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ముప్కాల్ పోలీసుస్టేషన్ ముట్టడించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మెండోరా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని ప్రజల పక్షాన పోరాడుతున్న పార్టీ నాయకులు,కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్‌రెడ్డి చేస్తున్న అక్రమాలు, ఆగడాలను ఎత్తి చూపుతున్న జోగు నర్సయ్యపై కేసులు పెట్టి, పోలీసుస్టేషన్‌కు రావాలని వేధిస్తున్నారని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నించినవారిపై అకారణంగా కేసులు పెడుతూ పోలీసుస్టేషన్‌కు ఎందుకు పిలిపిస్తున్నారని ఎస్సైని అడిగితే, కేసు పెట్టిన కాంగ్రెస్వాళ్లను అడిగిచెబుతామని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో సునీల్‌రెడ్డి..మాజీ మంత్రి వేములతోపాటు ఆయన కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేశారని, తాము ఇలా వ్యవహరించలేదని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రూ. వందల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు..ప్రశ్నిస్తున్న తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను గ్రామసభల్లో ఎంపిక చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ నాయకులు ఇంట్లో కూర్చొని ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. తాము ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, సక్రమంగా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే, కక్ష పెంచుకుంటున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిం చే హక్కులేదా అని ప్రశ్నించారు. మాది ప్రజాపాలన అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్ర శ్నించిన వారిపై కేసులు పెడుతూ కక్షపూరిత రాజకీయాలు చేయడమేనా ప్రజాపాలన అని నిలదీశారు. కేసులకు, పోలీసుల బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులెవరూ భయపడరన్నా రు. ఎన్ని కేసులు పెట్టి నా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు అయ్యేదాకా కాంగ్రెస్ నాయకులను ప్రజాకోర్టులో ఎండగడుతూనే ఉంటామని వారు స్పష్టం చేశారు.