సిరికొండ, డిసెంబర్ 4 : అన్నదాతలు మళ్లీ అప్పుల పాలవుతున్నారు. సర్కారు సాయం లేక రుణ ఊబిలో చిక్కుకుంటున్నారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత పంట సాగు కోసం మళ్లీ మిత్తీలు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కేసీఆర్ పాలనలో పంట పెట్టుబడికి రందీ లేకుండా పోయింది. దుక్కులు దున్నే సమయానికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఖాతాల్లో రైతుల డబ్బులు జమ చేయడంతో అన్నదాతలు సంతోషంగా పంటలు పండించారు. అయితే, మార్పు పేరుతో, ఆరు గ్యారంటీల గారడితో జనాల్ని బురిడీ కొట్టించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఊహించని షాక్ ఇచ్చింది. పంట సీజన్ ఆరంభానికే రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేయాల్సిన ఉండగా, వర్షాకాలానికి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. ఇక, యాసంగి మొదలై నెల రోజలవుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. రైతుభరోసా కింద రూ.15 వేలు ఇస్తామని చెప్పిన రేవంత్రెడ్డి రేపు, మాపు అంటూ కాలం గడుపుతున్నారు. నార్లు పోసేందుకు అదును దాటుతుండడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. సర్కారు నుంచి డబ్బులు రాకపోవడంతో అప్పులు తెచ్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
పదేండ్ల క్రితం వరకూ నీళ్లు, కరెంట్ సరిగా లేక, సర్కారు మద్దతు లేక అన్నదాతల బతుకులు ఆగమయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేసినా పంటలు పండక, పండిన పంటలకు గిట్టుబాటు ధర రాక వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ, తెలంగాణ సిద్ధించాక, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయొద్దనే భావనతో ప్రతిష్టాత్మక ‘రైతుబంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు. 2018-19 వానకాలం నుంచి ప్రారంభమైన ఈ పథకం కింద ఒక్కో పంట కాలానికి ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందించారు. ఉమ్మడి జిల్లాలోని 5.50 లక్షల మంది రైతులకు 11 విడుతల్లో వందలాది కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేశారు. ఒక్కో విడుతలో రూ.500 కోట్ల మేర ప్రభుత్వం పెట్టుబడి సాయం చేశారు. అలాగే, నిరంతర కరెంట్, సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తేవడంతో పాటు మద్దతు ధర చెల్లించి పంటలను కొనుగోలు చేశారు.
దశాబ్ద కాలం పాటు హాయిగా ఉన్న రైతులను కాంగ్రెస్ మళ్లీ కష్టాల్లోకి నెట్టేసింది. రేవంత్ ప్రభుత్వం రైతుబంధు ఎగ్గొట్టడంతో పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. ఎన్నికల వేళ రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలందరూ గప్పాలు కొట్టారు. రైతుబంధును రైతుభరోసాగా మార్చి కేసీఆర్ ఇస్తున్న రూ.10 వేలకు అదనంగా రూ.5 వేలు కలిపి ఇస్తామని హామీలు గుప్పించారు. కానీ అమలు చేయకుండా రైతులను అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. రైతుబంధు డబ్బులు పడకపోవడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు డబ్బుల్లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. అదును దాటిపోతుందన్న భయంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు, వానాకాలం సాయాన్ని ఇప్పటికే ఎగ్గొట్టేసిన రేవంత్ సర్కారు.. యాసంగికి సంబంధించి పూటకో ప్రకటనతో గందరగోళం సృష్టిస్తున్నది. పంటల సాగు ఆరంభానికి ముందే రైతులకు పెట్టుబడి అందించాలన్నది రైతుబంధు ముఖ్య ఉద్దేశం కాగా, కాంగ్రెస్ సర్కారు ఆ లక్ష్యాన్ని నీరుగార్చేసింది. సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామని రేవంత్రెడ్డి సహా మంత్రులు ప్రకటిస్తుండడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. నాట్లు వేశాక మీరు డబ్బులు ఇచ్చి ఏం లాభమని కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తామంటే నమ్మినం. కానీ, మొన్న వానకాలంల ఇయ్యలే. ఈసారైనా ఇస్తారో లేదో. కేసీఆర్ సారు ఉన్నప్పుడు దుక్కులు దున్నే టైంలనే ఖాతాల్లో డబ్బులు పడుతుండే. అవి విత్తనాలు, ఎరువులు కొనడానికి మస్తు ఉపయోగపడుతుండే. కానీ రేవంత్ సర్కారు అచ్చినంక పైసలు అస్తలేవు. మొన్న వానకాలంల ఇవ్వకుండా మోసం చేసిండ్రు. ఇప్పుడు యాసంగికైనా ఇయ్యాలే.
– బుక రాజేందర్, రైతు, చీమన్పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంక మళ్లీ కష్టాలు మొదలైనయ్. రైతు భరోసా ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడికి పైసలు లేక మస్తు ఇబ్బందులు అయితున్నయ్. నారు పోసే టైం అయింది. విత్తనాలు, ఎరువులు కొనాలే. చేతిలో పైసల్లేక అప్పులు చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం వెంటనే రైతుభరోసా డబ్బులు ఇచ్చి రైతులు అప్పుల పాలు కాకుండా చూడాలే.
– భూషణ్, రైతు, గడ్కోలు