రుద్రూర్, ఫిబ్రవరి 13: రేవంత్ సర్కారు రైతులతో చెలగాటమాడుతున్నది. రుణమాఫీ, బోనస్ హామీలే కాదు, రైతుభరోసా విషయంలోనూ మోసం చేస్తున్నది. అరకొరగా నిధులు ఇస్తూ అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. ఒక్కో సీజ్‌లో ఎకరాకు రూ.7500 చొప్పున ఎన్ని ఎకరాల భూమి ఉంటే అంత మొత్తం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందర ఊదరగొట్టింది. తీరా గద్దెనెక్కాక రైతుభరోసా పథకంలో అనేక నిబంధనలను విధించింది. సాగు చేసిన భూములకే అంటూ షరతులు పెట్టింది. ఇక, రెండు సీజన్లలో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. దాన్ని రూ.12 వేలకే పరిమితం చేసింది. అదన్న సక్కగా ఇవ్వకుండా రైతులను సతాయిస్తున్నది. ఎంత భూమి సాగులో ఉంటే అంత మొత్తం పెట్టుబడి సాయం చేయకుండా అరకొరగా విధిస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. సాంకేతిక తప్పిదాలను తెరపైకి తెచ్చి తమ నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అలవి కానీ హామీలు అనేకం ఇచ్చింది. రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాలపైనా వరాల జల్లు కురిపించింది. అనేక హామీలతో ప్రధానంగా రైతులను మభ్యపెట్టింది. 2023 డిసెంబర్ 9వ తేదీన రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, పంట రుణాలు లేని రైతులు వెంటనే రుణాలు తెచ్చుకోవాలని ఉసిగొల్పింది. కానీ 15 నెలలు గడుస్తున్నా సగం మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ చేయలేదు. ఇక, అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అమలువిషయంలో వెనుకడుగు వేసింది. సన్న వడ్లకే బోనస్ అంటూ రైతులను దారుణంగా మోసం చేసింది. మూడు నెలల క్రితం కొనుగోలు చేసిన సన్నవడ్లకు ఇప్పటికీ బోనస్ ఇవ్వకుండా రేవంత్ సర్కారు కర్షకులను కన్నీరు పెట్టిస్తున్నది.
రైతుభరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతూ రైతాంగాన్ని వంచిస్తున్నది. రైతుబంధు స్థానంలో రైతుభరోసా పేరుతో ఎకరాకు ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ అమలులో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే మూడు సీజన్లకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రేవంత్ సర్కారు ఎగ్గొట్టింది. కేసీఆర్ హయాంలో పంట వేసే సమయంలోనే పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు ఆగిపోయింది. రైతుభరోసా అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. సాగులో ఉన్న భూములకే అని మాట తప్పారు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి దాన్ని రూ.12 వేలకు పరిమితం చేశారు. జనవరి 26న రైతుభరోసా నిధులు జమ చేస్తామని గొప్పగా ప్రకటించారు. తీరా మార్చి 31 లోపు ఇస్తామని మరింత గడువు పొడిగించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండెకరాల లోపు ఉన్న భూములకు పెట్టుబడి సాయం విడుదల చేశామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కానీ, అది కూడా సరిగా ఇవ్వకుండా రైతులను దగా చేసింది. ఒక రైతుకు రెండు ఎకరాల భూమి ఉంటే రూ.12 వేలు ఖాతాలో జమ చేయాల్సి ఉండగా, అరకొరకగా చేసి చేతులు దులుపుకుంటున్నది. దీంతో రైతులు సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. రైతుభరోసా ఇచ్చేదే ఆలస్యం. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా ఇలా మోసం చేయడం సరికాదని విమర్విస్తున్నారు.
ఈయన పేరు గైని పోశెట్టి. రుద్రూర్ మండలం చిక్కడ్పల్లి గ్రామానికి చెందిన రైతు. తనకున్న 2.01 ఎకరాల భూమిలో పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల రెండెకరాల లోపు ఉన్న రైతులకు రైతుభరోసా నిధులు విడుదల చేసింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున పోశెట్టికి రూ.12 వేలు రావాల్సి ఉండగా, ఖాతాలో రూ.7,050 మాత్రమే జమ అయ్యాయి. ఆందోళన చెందిన రైతు అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.