నిజామాబాద్, మే 23,(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోంది. బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. నెలలుగా పంట ఉత్పత్తులను చేతిలో పట్టుకుని తిరుగుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యారు. కామారెడ్డి జిల్లాలో జొన్న రైతులు అరిగోస పడుతున్నారు. మూడు నెలలుగా జొన్నలు అమ్ముకునేందుకు కళ్లు కాయలు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చి మార్క్ఫెడ్ ద్వారా జొన్న సేకరణకు సిద్ధమైంది. కొనుగోళ్లు షురూ అవుతున్న సంబురంలో రైతులు ఉండగా పిడుగుపాటు లాంటి నిబంధనతో తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. జొన్నల సేకరణపై మార్క్ఫెడ్ అధికారులు తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు.
రైతులు ఎంత పండిస్తే అంత కాకుండా కేవలం ఎకరానికి 10 క్వింటాళ్లు చొప్పున మాత్రమే సేకరించాలని నిర్ణయించడంతో లబోదిబోమంటున్నారు. ఎకరానికి ఈ సీజన్లో 25 నుంచి 30 క్వింటాళ్లు జొన్న దిగుబడి వచ్చింది. పది క్వింటాళ్లే ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగిలిన జొన్నలను ఏం చేయాలని రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ప్రతి ఏటా ఇదే పరిస్థితి దాపురిస్తోందని రైతులు విలవిల్లాడుతున్నారు. ఆంక్షల చట్రంలో రైతులను ఇరికించి ఇబ్బందికి గురి చేయడం సరికాదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ఆంక్షల ఎత్తివేత కోసం రైతులు పలు చోట్ల ఆందోళనలు చేసున్నప్పటికీ పట్టించుకునే నాథుడు కరువయ్యారు.
జొన్న రైతుల ఆక్రందన..
జొన్నలు పండించిన అన్నదాతల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మూడు నెలల క్రితమే పంట చేతికి వచ్చింది. మార్కెట్ యార్డుల్లో కుప్పలు పోశారు. రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోళ్లకు ఏర్పాట్లు జరగడం లేదు. మార్క్ఫెడ్ అధికారులు ఇటువైపే కన్నెత్తి చూడలేదు. మూడు నెలల పాటు ఆరుగాలం శ్రమించి పండించిన జొన్న పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. మధ్యలో అకాల వర్షం కురిసి జొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఫలితంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. దీనంతటికీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రైతులు మండిపడుతున్నారు.
వడగళ్ల వానకు, అకాల వర్షానికి తడిసి పోకుండా జొన్నలు కాపాడుకోవడానికి తిప్పలు పడాల్సి వస్తోంది. మండుటెండలో పడిగాపులు కాస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆక్రందనపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కామారెడ్డి జిల్లాలో జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడలోనే అత్యధికంగా జొన్నలు సాగు చేశారు. ఈసారి 70వేల ఎకరాల్లో జొన్న సా గు చేశారు. సుమారుగా 15వేల క్వింటాళ్ల మేర దిగుబడి అంచనాలు ఉన్నప్పటికీ ప్రభు త్వం మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. రైతులు రోడ్డు ఎక్కి ఆందోళనలు చేస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడం విడ్డూరంగా మారింది. క్వింటా జొన్నలకు కనీస మద్ధతు ధర హైబ్రిడ్ రకానికి రూ.3699, జొన్న(మల్దండి) రకానికి క్వింటా రూ.3749 చెల్లించాల్సి ఉంది. జొన్న సేకరణలో సర్కార్ వైaఫల్యంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
మిగులు జొన్నలు ఏం చేయాలి?
ఎకరానికి 10 క్వింటాళ్లు జొన్నలు మాత్రమే కొనుగోలు చేస్తే మిగిలిన జొన్నలను ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎకరానికి దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్లు వరకు వచ్చిందని రైతులు చెబుతున్నారు. మిగిలిన జొన్నలను ధర వచ్చేంత వరకు కాపాడుకునే పరిస్థితి లేదు. రైతుల వద్ధ అలాంటి వసతి అందుబాటులో కనిపించడం లేదు. కేవలం ప్రైవేటు వర్తకులకు అమ్ముకోవడం మినహాయిస్తే వేరే దారి లేదు. రైతుల కష్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విలువ ఇవ్వడం లేదు. తూతూ మంత్రంగా ఎకరానికి 10 క్వింటాళ్లు చొప్పున సేకరిస్తే 7లక్షల క్వింటాళ్లు మాత్రమే అవుతుంది. మార్కెట్లో 15లక్షల క్వింటాళ్లకు పైగానే జొన్నలు అందుబాటులో ఉన్నట్లుగా ప్రభుత్వాధికారులే చెబుతున్నారు.
మార్క్ఫెడ్ అధికారుల ఆంక్షలతో రైతులు అల్లాడిపోతున్నారు. ఇదేం ప్రభుత్వమో? ఇదేం కర్మ? అంటూ నిట్టూరుస్తున్నారు. మార్కెట్ యార్డులకు తరలించిన జొన్నలను సగమే కొనుగోలు చేస్తే మిగిలిన జొన్నలను ఇంటికి తీసుకెళ్లడానికి అదనంగా రవాణా ఖర్చు మీద పడనుంది. దిక్కులేక రైతులంతా కలిసి ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకునేంత దౌర్భాగ్యకరమైన పరిస్థితిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కల్పిస్తోంది. పరోక్షంగా ప్రైవేటు వర్తకులపై ఆధారపడే విధంగా రైతులకు గడ్డు కాలాన్ని మార్క్ఫెడ్ తీసుకు వస్తోంది. తక్షణం ఎకరానికి 10క్వింటాళ్ల ఆంక్షలను ఎత్తేసి పూర్తి స్థాయిలో జొన్నలు సేకరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మిగిలిన జొన్నలు ఎక్కడ అమ్ముకోవాలి?
ప్రభుత్వం ఎకరానికి కేవ లం 10 క్వింటాళ్ల వరకే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. గతంలో ఎకరాకు 14 క్వింటాళ్లు కొనుగోలు చేస్తే ఈసారి నాలుగు క్వింటాళ్లు తగ్గిం చి 10 క్వింటాళ్లకు పరిమితి విధించింది. మిగిలిన జొన్నలు ఎక్కడ అమ్ముకోవాలి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తుందనే సంతోషం లేకుండా పోయింది. అందుకే సాగు చేసిన జొన్న పంటను మొత్తం కొనుగోలు చేసి ఆదుకోవాలి. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. నిబంధనలు విధించడంతో తీవ్రంగా నష్టపోయి చేతికి అప్పులు మిగిలేలా ఉన్నాయి.
-నాగరాజు, రైతు, సింగీతం
జొన్న రైతులపై ప్రభుత్వం కక్ష సాధిస్తుంది..
ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఎకరానికి 10 క్వింటాళ్ల వరకే కొనుగోలు పరిమితి విధించడం జొన్న సాగు చేసిన రైతులపై కక్ష సాధింపు చర్యలా ఉన్నది. ప్రభుత్వం విధించిన షరతుతో ఎకరాలకు పది క్వింటాళ్లు కొనుగోలు చేస్తే, మిగిలిన జొన్న పంటను ఎవరికి ఎక్కడ అమ్ముకోవాలి. నాకున్న రెండెకరాల్లో జొన్న సాగు చేస్తే, 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం రెండు ఎకరాలకు 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగిలిన 30 క్వింటాళ్లు దళారులకు విక్రయించుకోవల్సిందే. దళారులు రూ.2000 నుంచి రూ.2500 లోపే కొనుగోలు చేస్తుండడంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
-కండయాల లక్ష్మణ్, రైతు, వడ్లం
పది క్వింటాళ్ల కొనుగోలు పనికిమాలిన చర్య
నాకున్న 25 ఎకరాల్లో జొన్న పంటను సాగు చేశా.సుమారు 500 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఎకరాకు పది క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయనున్నట్లు షరతు విధించింది. పైగా రైతు బయోమెట్రిక్ కూడా పెట్టింది. దీంతో వృద్ధులు దూరంలో ఉన్న వాళ్లు రావడం ఇబ్బంది. దీనికి తోడు ఎకరాకు పది క్వింటాళ్లు కొనుగోలు చేస్తే మిగిలిన పంటను ఏం చేయాలి. ప్రభుత్వ పనికిమాలిన చర్యతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిందే. ఇప్పటికైనా రైతు పండించిన జొన్నను పూర్తిగా కొనుగోలు చేయాలి లేదంటే ఆందోళన చేస్తాం.
-మందడి నారాయణరెడ్డి, రైతు, రాంపూర్ కలాన్