నిజామాబాద్, సెప్టెంబర్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ప్రజలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి నెట్ వర్క్ ఆసుపత్రుల సంఘం తేల్చి చెప్పగా మంగళవారం అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ కానున్నాయి. సర్కారుతో చర్చలు నడుస్తున్నప్పటికీ అనేక ఆసుపత్రుల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు అనధికారికంగా నిలిచి పోయాయి.
బిల్లులు రావడం లేదనే కారణంతో చాలా మంది ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు నేరుగా రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తోన్న దాఖలాలు అనేకం ఉన్నాయి. బిల్లులు వచ్చిన తర్వాత చెబుతాం అంటూ బుకాయిస్తున్నారు. ఒక వేళా బిల్లులు మంజూరైతే తిరిగి డబ్బులు ఇస్తున్నారా? లేదా? అన్నది స్పష్టత లేకుండా పోయింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు దవాఖానాల్లో ఆరోగ్యశ్రీ పేరిట రోగులను జాయిన్ చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు.
చాలా రోజులుగా ఆసుపత్రుల యాజమాన్యాలు అనుసరిస్తోన్న తీరుతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక్కట్లకు గురవుతున్నారు. తమకు డబ్బు లు రాకపోవడంతో ఆసుపత్రుల నిర్వాహణ కష్టతరంగా మారిందం టూ యాజమాన్యాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో సర్కారు తీరుపైనే ప్రజలంతా ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ దాపురించలేదు. కానిప్పుడు ఆరోగ్య సేవల విషయంలో తలెత్తిన తీవ్ర సమస్యతో రోగులంతా ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది.
10నెలలైనా చెల్లింపులు కరువు..
ఆరోగ్యశ్రీ పథకంలో భాగమైన ప్రైవేటు ఆసుపత్రుల్లో నిబంధనలకు మేరకు వైద్య సేవలను అందిస్తారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఆమోదం పొందిన శస్త్ర చికిత్సలు, ఇతర వైద్యానికి చికిత్సను అందిస్తారు. రోగి డిశ్చార్జి అయ్యాక 45 రోజుల్లోనే బిల్లులు ఆయా ఆసుపత్రులకు చెల్లించాలి. కానిప్పుడు 10 నెలలు అవుతోన్న పెండింగ్లో ఉంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.5లక్షల నుంచి రూ.10లక్షల రూపాయలకు పెంచారు.
దీని వల్ల ఆసుపత్రులపై ఆర్ధిక భారం మరింత పెరిగింది. చిన్న, మధ్య తరగతి ఆసుపత్రులకు ఈ చెల్లింపులు లేకపోవడం, ఆలస్యం కావడంతో డాక్టర్లకు, ఆసుపత్రిలో స్టాఫ్కు జీతభత్యాలు, ఆసుపత్రి నిర్వహణకు పెట్టుబడి పెట్టలేక చేతులు ఎత్తేస్తున్నారు. రూ.కోట్లలో బిల్లులు పెండింగ్లో ఉండటం మూలంగా ఆసుపత్రులు మూసివేతకు దారి తీసే ప్రమాదం ఉందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చికిత్స అందిస్తోన్నందుకు ప్యాకేజి రేట్ల సవరణపైనా డిమాండ్ కొనసాగుతోంది.
చికిత్స ఖర్చులకు అనుగుణంగా ప్యాకేజీ రేట్లను సవరించాలని నెట్ వర్క్ ఆసుపత్రులు కోరుతున్నాయి. ఆసుపత్రులు ఫిర్యాదుల పరిష్కారానికి ఒక గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరోగ్య శ్రీ కార్డుదారులు ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారు ఖరీదైన ప్రైవేటు ఆసుపత్రుల చికిత్సలను భరించలేకపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పటికే రద్దీగా ఉండటంతో ఈ బకాయిల సమస్యతో వైద్య సేవల సమస్యను మరింత తీవ్రం కానుంది.
సేవలకు తీవ్ర అంతరాయం?
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో 1672 రకాల చికిత్సలు, 21 స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు. ఈ సేవలు అందించే ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లించకపోవడంతో సేవలను నిలిపేసేందుకు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్న వివరాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.1300 కోట్లు నుంచి రూ.1400 కోట్లు రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
ఇందులో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రావాల్సిన బకాయిలు దాదాపుగా రూ.100కోట్లు వరకు ఉంటుందని అంటున్నారు. ఈ బకాయిలు దాదాపుగా రెండు సంవత్సరాలుగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెల్లింపులకు నోచుకోవడం లేదు. దీని వల్ల ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య కారణంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చిన్న, మధ్య తరగతి ఆసుపత్రులు విలవిల్లాడుతున్నాయి.
ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బకాయిలు క్లియర్ చేస్తేనే పేదలకు ఆరోగ్యశ్రీ వర్తించే వీలుంది. సర్కారుతో చర్చలు సఫలమైనా ఆయా ఆసుపత్రుల్లో సేవలు అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు సుముఖంగా లేకపోవడం శోచనీయం. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది దిగువ మధ్య తరగతి కుటుంబాలు, పేద ప్రజలంతా వైద్య సేవలను కోల్పోయే ప్రమాదం ఉంది.