రామారెడ్డి(సదాశివనగర్), ఏప్రిల్ 9: కేసీఆర్ పాలన లో రాష్ట్రం పురోగమించిందని, ప్రస్తుతం తిరుగోమన దిశగా సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండెత్తి రావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. సదాశివనగర్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్‌గా ఉంటే ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలనలో 11వ స్థాయి దిగజారిందని విమర్శించారు.
జీఎస్డీపీలో మూడో స్థానంలో ఉండగా.. 14వ స్థానానికి చేరిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్రంతోపాటు ఇతర రాష్ర్టాలు అనుసరించాయని గుర్తుచేశారు. కేసీఆర్ 15 ఏండ్లుగా అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పెట్టాడని చెప్పారు. స్వరాష్ట్రంలో కరెంటు, నీటి గోస లేకుండా చేశాడని తెలిపారు. నీటి కోసం మహిళలు కిలోమీటర్ల దూరం నడిచే బాధను తప్పించి, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధ జలాలను అందించారన్నారు. రాష్ట్రంలో కేవలం 70లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉన్న వరి ధాన్యం.. కేసీఆర్ అందించిన సాగునీటి వనరులతో రెండు లక్షల 70వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని చెప్పారు.
ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, రైతు పండించిన ప్రతి గింజనూ కొన్నారని, డబ్బులు వెంటనే రైతు బ్యాంకు ఖాతాలో జమ చేశారని గుర్తుచేశారు. వరి నాట్ల కోసం కేసీఆర్ రైతుబంధు డబ్బులు వేస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికలు వస్తేనే రైతు బంధు డబ్బులు ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో పూర్తిచేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలను అధికారం చేపట్టి 500 రోజులైనా ఇంకా అమలుచేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ అమ లు చేసిన పథకాలను కూడా ముందుకు తీసుకెళ్లలేని అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూములు అమ్మి, డబ్బులు దాచుకొనే పనిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు.
తెలంగాణ కోసం బీఆర్ఎస్ పుట్టిందని, 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో నిర్వహించనున్న రజతోత్సవ వేడుకలకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసేలా సభలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. వాల్ పోస్ట ర్లు, వాల్ పెయింటింగ్‌లు రాయించాలన్నారు. సభకు తరలివెళ్లే ముందు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ను ఆవిష్కరించాలని సూచించారు. సమావేశంలో సమాశివనగర్ మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్‌రావు, గాం ధారి ఏఎంసీ మాజీ చైర్మన్ సాయినేని సత్యంరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింహులు, రామారెడ్డి మాజీ ఎంపీపీ దశరథ్‌రెడ్డి, తాడ్వాయి సొసైటీ చైర్మన్ కపిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.