నిజాంసాగర్, జూలై 16: చినుకు జాడ కరువైన తరుణంలో రైతాంగం నిజాంసాగర్ వైపు ఆశగా చూస్తున్నది. ప్రాజెక్టులో సంతృప్తికర స్థాయిలో నీళ్లు ఉండడంతో ఆయకట్టుకు ఎప్పుడు నీటి విడుదల చేస్తారా? అని ఎదురు చూస్తున్నది. ఇప్పటికే నార్లు పోయడం, నాట్లు ఊపందుకుంటున్న తరుణంలో నీటి విడుదల విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. వర్షాలు ముఖం చాటేయడం, ఎండలు దంచి కొడుతుండడంతో నార్లు ఎండుముఖం పడుతున్నాయి. నాట్లు వేసిన పొలాలు నీరందక నెర్రెలు వారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పంటల సాగులో నిమగ్నమైన రైతులను వర్షాభావ పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎల్నినో ప్రభావం కారణంగా ఈసారి వానలు పెద్దగా కురియడం లేదు. వర్షాకాలం ఆరంభమై దాదాపు ఒకటిన్నర నెలలు దాటినా భారీ వర్షాలు లేకుండా పోయాయి. కరువు పరిస్థితులు గోచరిస్తున్న తరుణంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు, నిజాంసాగర్ నీటిని విడుదల చేసి పంటలను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో కోటగిరి మండలంలో మహా రైతుధర్నా నిర్వహించారు.
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1394.58 అడుగుల (6.55 టీఎంసీల) మేర నీరు నిల్వ ఉంది. అయితే, ఆవిరి రూపంలో, లీకేజీ రూపంలో 1.50 టీఎంసీల నీరు వృథాగా పోతుంది. అర టీఎంసీ నీరు డెడ్ స్టోరేజీగా ఉంటుంది. అంటే, రెండు టీఎంసీల నీళ్లు పోనూ మిగిలేది 4.50 టీఎంసీలు మాత్రమే. ఆయకట్టు పంటలు గట్టెక్కాలంటే మొత్తం 9 టీఎంసీలు అవసరం. ఇప్పుడున్న 4.50 టీఎంసీలకు తోడు మరో నాలుగు టీఎంసీలు అవసరమవుతాయి. ఒకవేళ ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురియకపోతే పంటలు గట్టెక్కడం కష్టమేనని ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు, సాగర్ నుంచే బోధన్, నిజామాబాద్ పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఆయకట్టుకు సాగునీరు విడుదల చేస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, నీటి విడుదలపై స్టేట్ లెవల్ కమిటీ ఫర్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ (శివమ్) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఈ కమిటీ భేటీ అయ్యే అవకాశముందని తెలిసింది.
నిజాంసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటూ రైతులు కోరుతున్నప్పటికీ అటు అధికారుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. ఇటీవల అన్నదాతలు నీటిపారుదల శాఖ అధికారులను కలిసి మొర పెట్టుకోగా, జూలై 7వ తేదీన డీఐబీ సమావేశం ఏర్పాటు చేసి, నీటి విడుదలపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. కానీ వారు చెప్పిన గడువు దాటిపోయి పది రోజులవుతున్నది. కానీ డీఐబీ భేటీ మాత్రం జరుగలేదు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిజాంసాగర్ ఆయకట్టు కింద పొలం ఉంది. ఇప్పటికే నాట్లు వేయడం సగం పూర్తయింది. మిగతా పొలంలో నాట్లు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే, నిజాంసాగర్ నుంచి నీటి విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. నీళ్లు ఇవ్వకుంటే పంటలు గట్టెక్కడం కష్టమే. సాగర్ ఆయకట్టు కింద బోర్లు ఉన్న వాళ్లు మాత్రమే నాట్లు వేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు తక్కువగా పోస్తున్నాయి. పంటలు గట్టెక్కాలంటే నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలి.
– మనీశ్రెడ్డి, రైతు, బుర్గుల్
నిజాంసాగర్ ఆయకట్టు కింద వానకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ నీటి విడుదలపై ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేవు. డీఐబీ సమావేశం జరగాల్సి ఉండగా ఇంకా కాలేదు. ఈనెల 15వ తేదీన డీఐబీ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. అధికారుల ఆదేశాల మేరకు నీటి కేటాయింపులు ఉంటాయి. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో నీటి విడుదలలో ఎలాంటి మార్పులు వస్తాయో, లేక యదావిధిగా నీటి విడుదలకు ఆదేశాలు వస్తాయో ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నీటిని విడుదల చేస్తాం.