నిజామాబాద్, ఏప్రిల్ 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గిరిజన తండాలు స్వయం పాలనతో సమృద్ధిలోకి వస్తున్నాయి. కేసీఆర్ చూపిన దారిలో వికసిస్తున్నాయి. ఒకప్పుడు ఏదో ఒక గ్రామానికి అనుసంధానంగా కొనసాగిన తండాలు… నేడు స్వయం పాలనలో సగర్వంగా నిలబడుతున్నాయి. 500 జనాభా కలిగిన గిరిజన, ఆదివాసి తండాలు, ఆవాసాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా ఇదంతా సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దీర్ఘ దృష్టి, ముందు చూపుతోనే ఇదంతా సాధ్యమైంది.
2018లో తీసుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టంతో తండాలు అధికారికంగా గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందాయి. తదనంతరం జరిగిన ఎన్నికల్లో తొలిసారి 2019లో పాలకవర్గాలు ఏర్పాటు అయ్యాయి. జీపీలుగా మారిన తండాల్లో గిరిజనులకే రిజర్వేషన్లు దక్కాయి. తండావాసులకే పాలన పగ్గాలు అందివ్వడంతో గిరిజన ప్రజలంతా మురిసి పోయారు. రాజకీయ అవకాశాలు పుష్కలంగా పెరిగి గిరిజన నాయకత్వం బలోపేతమైంది. గిరిజన తండాల్లో ఇతంటి ఘనతను సాధించడానికి ప్రధాన కారణం మూడు అక్షరాల కేసీఆర్ మాత్రమే. సరిగ్గా ఏడేళ్ల క్రితం జీపీలుగా మారిన తండాలు నేడు గ్రామ స్వరాజ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.
తండాలంటే ఊరికి చివరన, ఎక్కడో కొండల్లో, గుట్టల్లో పడేసినట్లు విస్తరించిన చిన్నపాటి ఆవాస కేంద్రాలు. ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన వ్యక్తుల సమూహంతో ఏర్పడిన శ్రమైక జీవనం వీటి సొంతం. వ్యవసాయం, అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగించే తండాల్లో స్వతంత్ర భారతావనిలో ఏనాడు ఏ పాలకులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. స్థానిక పాలనను చేరువ చేయాలని దశాబ్ధ కాలం క్రితమే తలచిన కేసీఆర్ స్వరాష్ట్రంలో గిరిజనుల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేశారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందించి స్వపరిపాలనను స్థానికుల చెంతకు తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్రంలో తండాలన్నీ మా పాలన… మా తండా… అన్న నినాదంతో నినదిస్తున్నాయంటే అందుకు కేసీఆర్‌కే ఆ ఘనత దక్కుతుంది. స్వతంత్ర భారతావనిలో ఏ పాలకునికి రాని ఆలోచనను అమలు చేసి తండాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.
బీఆర్ఎస్ పాలనలో పుష్కలమైన నిధులతో తండాలు అభివృద్ధితో కొత్త శోభను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం – 2018 ప్రకారం కామారెడ్డి జిల్లాలో 214 నూతన గ్రామ పంచాయలు ఏర్పడ్డాయి. అందులో 116 తండాలను గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 532 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 71 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. ప్రస్తుతం 545 గ్రామ పంచాయతీలు మనుగడ సాధిస్తున్నాయి.