ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతి పెద్ద చక్కెర ఫ్యాక్టరీగా పేరొందిన బోధన్ నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కళావిహీనంగా మారింది. పాతికేండ్ల క్రితం జాయింట్ వెంచర్ పేరిట నిజాం షుగర్స్‌లోని ఈ శక్కర్‌నగర్ యూనిట్ ప్రైవేట్‌పరం కావటంతో.. అప్పటినుంచి దీని క్షీణదశ ప్రారంభమైంది. 2015లో ప్రైవేట్ యాజమాన్యం నిజాం షుగర్స్ శక్కర్‌నగర్ యూనిట్‌తో పాటు మెదక్ జిల్లాలోని ముంబాజీపల్లి, జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి యూనిట్లకు లేఆఫ్ ప్రకటించింది.
దీంతో ఈ చక్కెర కార్మాగారాలు మూతపడ్డాయి. నిజాం షుగర్స్ మదర్ యూనిట్‌గా భావించే శక్కర్‌నగర్ ఫ్యాక్టరీ పదేండ్లుగా పునరుద్ధరణకు నోచుకోలేదు. నిజాం షుగర్స్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఇదిగో, అదుగో అంటూ రెండున్నరేండ్లుగా కాలయాపన చేస్త్తూ వస్తున్నది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంటూ హడావుడి చేసి, రైతులు కార్మికులను మభ్యపెట్టిన రేవంత్ సర్కారు..
కొన్ని నెలలుగా ఊసే ఎత్తడం లేదు. దీంతో ఇక పునరుద్ధరణ అటకెక్కినట్లేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ సందేహాలకు బలం చేకూర్చుతున్నాయి. నిజాం షుగర్స్ మూతబడి నందున, పామాయిల్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని సుదర్శన్‌రెడ్డి సభలో విన్నవించారు. దీంతో నిజాం షుగర్స్‌ను పునరుద్ధరించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
పదేళ్ల లేఆఫ్ ఫలితంగా ఫ్యాక్టరీ ప్రాంగణమంతా పిచ్చిమొక్కలు, పొదలు, చెట్లతో నిండిపోయింది. ఫ్యాక్టరీలోని మిల్‌హౌస్, ఇతర యంత్రాలు తుప్పు పట్టాయి. వినియోగంలో లేకపోవటంతో ఫ్యాక్టరీలోని యంత్రాలు పాడై పోయాయి. బాయిలర్స్ ట్యూట్లు, జ్యూస్ హీటర్స్, జ్యూస్ ప్యాన్లు, క్రిస్టల్ లైనర్స్, సల్ఫేట్ హౌస్, సున్నం మిల్లు తదితర యంత్రాలు దెబ్బతిన్నాయని కార్మికులు అంటున్నారు. మిల్‌హౌస్ అస్తవ్యస్తంగా తయారయింది.
వస్తే నిజాంసాగర్స్ను పునరుద్ధరిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు.. ఆ మాటను గాలికొదిలేశారు. ఇదిగో.. అదిగో పునరుద్ధరణ అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంటూ
హడావిడి చేసి చెరుకు రైతులు, కార్మికులను మభ్యపెట్టిన సర్కార్.. గత కొన్ని నెలలుగా ఈ విషయమై సైలెంట్ అయిపోయింది. దీంతో ఇక నిజాం షుగర్స్ పునరుద్ధరణ అటకెక్కినట్టేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-బోధన్, ఏప్రిల్ 13
నిజాం షుగర్స్ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి నుంచీ స్పష్టమైన వైఖరి కరువైంది. పునరుద్ధరణ కోసం రైతులు చెరుకు పెట్టాలంటూ విజ్ఞప్తులు చేయటమే తప్ప చెరుకు సాగుచేసేవారికి ఇచ్చే ప్రోత్సాహకాలపై ప్రకటనలు చేయలేదు. దీంతో రైతులు చెరుకు సాగుకు ముందుకు రావటం లేదు. రేవంత్ సర్కార్ పునరుద్ధరిస్తారన్న నమ్మకం తమకు తేదని రైతులు అంటున్నారు. రైతుల సంగతలా ఉంచితే, ఫ్యాక్టరీని నడపాలంటే ముందుగా యంత్ర పరికరాల స్థితిగతులపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు అటువంటి ప్రయత్నమేదీ లేదు.
రన్నింగ్ కండిషన్లో ఉన్న ఫ్యాక్టరీ ఓవర్ ఆయిలింగ్ కోసమే పెద్ద తతంగం ఉంటే, పదేండ్లుగా నిరుపయోగంగా ఉన్న ఫ్యాక్టరీని నడపాలంటే.. దాన్ని మరమ్మతులకు ఎంతకాలం పడుతుందో పాలకులు గుర్తించాలి. ఓవర్ ఆయిలింగ్ కోసమే అప్పట్లో ఏటా రూ.3 కోట్లు ఖర్చు అయినప్పుడు.. పాడయిన యంత్రాలతో కూడిన ఫ్యాక్టరీని గాడిలో పెట్టాలంటే, ఇంకా ఎన్ని కోట్లు ఖర్చవుతాయో అంచనా వేయాలి.. ఏయే యంత్రాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో.. కొత్తగా ఏం కావాలో తెలుసుకోకుండా.. పునరుద్ధరణ అంటూ కాంగ్రెస్ పాలకులు హడావుడి చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఇదంతా చేశారన్న అనుమానం కలుగుతున్నది. నిపుణుల కమిటీ నియామకం లేకుండా, రూపాయి కేటాయించ కుండా ‘పునరుద్ధరణ’ ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు.
ఇటీవల కాలంలో నిజాం షుగర్స్ పునరుద్ధరణ మాటను కాంగ్రెస్ నాయకులు ఎత్తటమే లేదు. ఇక, ఇటీవల సీఎం నిజామాబాద్ సమీపంలో జరిగిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభలో సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ‘చక్కెర ఫ్యాక్టరీ మూత పడినందున పామాయిల్ ఫ్యాక్టరీని మంజూరుచేయాలి’ అంటూ వ్యాఖ్యానించడంతో ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఆశలు ఆవిరయ్యాయి. ఇదిలా ఉంచితే, ఫ్యాక్టరీ యంత్రాలు, పరికరాలను కాపాడటానికి తక్షణం చర్యలు తీసుకోకపోతే.. వరుస చోరీలు జరుగుతున్న క్రమంలో.. ఆఖరికి ఆ ‘తుక్కు’ కూడా దక్కదన్న విషయాన్ని ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.
శక్కర్‌నగర్‌లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ ఆస్తులకు భద్రత కరువయింది. నిజాం షుగర్స్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో సెక్యురిటీ నామమాత్రంగా ఉంది. దీంతో రోజురోజుకూ చోరీలు పెరుగుతున్నాయి. ఫ్యాక్టరీ లోపలికి గోడలు దాటి ప్రవేశిస్తున్న దుండగులు అక్కడి స్క్రాప్‌ను దొంగిలిస్తున్నారు. ఇది నిరంతరం జరగుతున్నా.. దీన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. కొన్నేళ్ల క్రితం ఫ్యాక్టరీలోని కొన్ని యంత్రాలను, స్క్రాప్‌ను ప్రైవేట్ యాజమాన్యమే తరలించుకుపోయింది. అప్పట్లో కార్మికులు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చినప్పటికీ, ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. ఇక, ఇటీవల కాలంలో యంత్ర పరికరాల చోరీలు పెరిగిపోయాయి.
చిన్న చిన్న మోటార్లు, పరికరాలు, స్క్రాప్.. ఇలా ఈ పదేళ్లలో టన్నుల కొద్దీ చోరీకి గురయినట్లు తెలుస్తున్నది. ఈ విషయమై ఫ్యాక్టరీ కోర్ కమిటీ అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదులు చేయటం జరిగింది. వాస్తవానికి ప్రతి ఏటా చెరుకు క్రషింగ్ జరుగుతూ.. ఫ్యాక్టరీ రన్నింగ్ కండిషన్లో ఉన్నప్పటికీ.. క్రషింగ్ సీజన్ పూర్తయిన తర్వాత.. మళ్లీ రాబోయే క్రషింగ్ సీజన్ కోసం ప్రతిఏటా క్రమం తప్పకుండా ‘ఓవర్ ఆయిలింగ్’ చేస్తుంటారు. ఈ ‘ఓవర్ ఆయిలింగ్’ ఆరు నెలలపాటు జరుగుతుంటుంది. ఈ ఓవర్ ఆయిలింగ్కు ఒక్కోసారి రెండు నుంచి మూడు కోట్ల వరకు ఖర్చు అవుతుంటుంది.
పదేండ్లుగా ఫ్యాక్టరీ మూతపడడంతో యంత్ర పరికరాలు ఓవర్ ఆయిలింగ్కు నోచుకోక పాడయిపోతున్నాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క నిజాంషుగర్స్‌కు చెందిన జనరల్ దవాఖాన భవనం, ఇతర భవనాలకు ఉన్న విలువైన కలప, సామగ్రి మాయమవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళలలో గోడలను సైతం తవ్వి.. వీటిని చోరీ చేస్తున్నారు. ఇదంతా ఒక ముఠా ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు భావిస్తున్నారు.