బాన్సువాడ, మే 17 : రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పదవులు పంచుడు తప్ప, ప్రజలకు చేస్తున్నది ఏమీలేదని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి రెండున్నరేండ్లు గడుస్తున్నా ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు డబ్బులు సకాలంలో వారి ఖాతాల్లో వేసిందని, కానీ రేవంత్‌రెడ్డి సర్కారుకు సకాలంలో ‘రైతుభరోసా’ ఇవ్వడం ఎందుకు సాధ్యం కావడంలేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంటే, స్వరాష్ట్రంలో తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడంతో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నదని తెలిపారు. ఈ ఘనత కేసీఆర్‌కే దక్కుతున్నదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి , రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన నాయకుడు కేసీఆర్ అని వీజీ గౌడ్ అన్నారు. తెచ్చిన రాష్ట్రం ప్రస్తుతం దొంగల పాలు, దోపిడీకి గురికాకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు రక్షణ కవచాలుగా నిలువాలని కోరారు. బాన్సువాడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో బాజిరెడ్డితో కలిసి మాట్లాడారు. డిజిటలైజేషన్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించనున్నట్లు తెలిపారు.
గ్రామానికి, బూత్‌కు ఇద్దరు మంచి పరిజ్ఞానం ఉన్న వారిని బూత్ యాక్టివ్ కమిటీ సభ్యులుగా నియమించాలని సూచించారు. మండలానికి ఐదుగురు సమన్వయ కర్తలు ఉంటారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో 2,361 బూత్‌లు ఉన్నాయని, వాటికి సుమారుగా 4,722 మంది బూత్ కమిటీ సభ్యులుగా నియమించనున్నట్లు తెలిపారు. గతంలో క్రియాశీలక సభ్యత్వం రూ.100 ఉంటే , ప్రస్తుతం రూ.50, సాధారణ సభ్యత్వ నమోదు కేవలం 10రూపాయలు ఉంటుందని తెలిపారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో ఒక్కో నియోజక వర్గం వారీగా శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.