నిజామాబాద్, జూన్ 27, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాధవనగర్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ దొందూ దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. నిజామాబాద్ నగర వాసుల ఇక్కట్లు తొలగించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన ఆసక్తి, పట్టింపుతనం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలకు కనిపించడం లేదు. ఆర్వోబీ నిర్మాణ పనులు నెమ్మదించడానికి మొదటి కారణం బీజేపీ పార్టీ అయితే రాష్ట్రంలో అధికారం చలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండో ముద్దాయిగా నిలుస్తోంది. మాధవనగర్ పైవంతెన తాత్సారంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో బీజేపీ ఎంపీ పనితీరు వెలుగు చూస్తోంది. రెండుసార్లు ఎంపీగా గెలిచి ఏం సాధించావ్? అంటూ అర్వింద్‌ను నగరవాసులు అడుగుతుండటంతో కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారు.
చీటికి మాటికి కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై విషం కక్కడానికి సమయం కేటాయించే నిజామాబాద్ ఎంపీకి రేవంత్ ప్రభుత్వంపై మాటెత్తడానికి ధైర్యం సరిపోవడం లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టును నిలిపేయడం, కేసీఆర్ పథకాలను ఆపేయడానికి ఉత్సాహం చూపుతోన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్వోబీకి గ్రహణం పట్టుకున్నైట్లెంది. ఇచ్చిన నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో నిర్మాణం ఆగింది. జూన్ నెల నాటికి రూ.3కోట్లు బిల్లులు కాంట్రాక్టర్‌కు నిలిచి పోయినట్లుగా బీజేపీ ఎంపీ ఫేస్బుక్ పోస్టులో వివరించాడు. అదే నిజమైతే కాంగ్రెస్ పాలకులు వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. బీజేపీ తప్పిదాలను నిలదీయాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటిదేమీ కానరాకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది.
కాంగ్రెస్, బీజేపీలకు ఫక్తూ రాజకీయమే పరమావధిగా పని చేస్తున్నాయి. ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. నగరవాసుల మేలుకై పాటుపడటం లేదు. మాధవనగర్ ఆర్వోబీ ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. రూ.63కోట్లు నిధులిచ్చి ప్రచారం చేసుకోలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ… 2023, డిసెంబర్ వరకు వేగంగా పనులు చేపట్టింది. కానిప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి.
ఇరు పార్టీ నేతలు ఈ బ్రిడ్జి నిర్మాణంపై సరైన రీతిలో ఆసక్తి చూపడం లేదు. పరస్పర ఆరోపణలకే పరిమితం కావడం మినహా నిధులు తెచ్చి ఆర్వోబీ పూర్తి చేయించడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డు తగిలింది. నిధులు విడుదలలో జాప్యం వహించింది. ఫలితంగా కేంద్రం సహకరించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా ధర్నాలు చేaయాల్సి వచ్చింది. నేడు రాష్ట్రం సహకరించడం లేదంటూ బీజేపీ పార్టీ నేతలు, ఎంపీ అర్వింద్ చెప్పుకుంటున్నారు. వాస్తవానికి కేసీఆర్ మంజూరు చేసిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఈ విషయంపై బీజేపీ ఎంపీ తనదైన ైస్టెల్లో ఆరోపణలు గుప్పించడం లేదు.
సుతిమెత్తగా ఆరోపణలు చేస్తూ పూట గడుపుతున్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసేందుకు బట్టలు చించుకుని మాట్లాడే అర్వింద్‌కు రేవంత్ సర్కారును నిలదీసేందుకు నోరు రావడం లేదా? అని స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అప్పుడలా? ఇప్పుడిలా? ఎందుకు ఫక్తూ రాజకీయాలు చేస్తున్నారని అడుగుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే బీజేపీ సర్కారు సహకరించి ఉంటే ఇప్పటికే రాకపోకలు మొదలు అయ్యేవి. బీజేపీ పాలిత రాష్ట్రం కాకపోవడంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష కట్టి రైల్వే పై వంతెన నిర్మాణానికి తగు రీతిలో సహకరించలేదు. కేవలం తూతూ మంత్రంగా రూ.30 కోట్లు మాత్రమే భరించి చేతులు దులుపుకుంటోంది.