నిజామాబాద్, సెప్టెంబర్ 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులు అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలకు జీవనాన్ని కొనసాగించడం కష్టతరంగా మారింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున హామీలు గుప్పించింది. దివ్యాంగుల ఓట్లను కొల్లగొట్టేందుకు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ ర్డెడి ఏకంగా రూ.6వేలు పింఛన్ ఇస్తామంటూ చెప్పారు. హస్తం పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని ప్రకటించింది. ఎన్నికల బహిరంగ సభల్లోనూ ఈ అంశాన్ని నొక్కి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు అవుతోంది.
ఇంత వరకూ దివ్యాంగులకు పింఛన్ల పెంపు ఊసే లేకుండా పోయింది. ఇదేమని ప్రశ్నిస్తే పట్టించుకునే వారే కరువయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దివ్యాంగులకు పెద్దపీట దక్కింది. అరకొరగా అందుతోన్న పింఛన్లను భారీగా పెంచి సాయం అందించారు. మొదట్లో ప్రతినెలా రూ.3,116లకు చొప్పున దివ్యాంగుల పింఛన్ పెంచారు. ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.4,116 చొప్పున అందించారు. బీఆర్ఎస్ను ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో భారీగా పింఛన్ పెంచి ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయకపోవడంతో దివ్యాంగులు నిరాశకు గురవుతున్నారు.
దివ్యాంగులకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీరును అన్ని వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో తప్పు బడుతున్నారు. అభాగ్యులను ఆదుకోవాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించడం ఏ మాత్రం సహించలేనిదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2023, డిసెంబర్ నుంచి నేటి వరకు ప్రతి నెలా పింఛన్ పెంపు కోసం దివ్యాంగులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం స్పందన లేకపోవడంతో అర్హులైన దివ్యాంగ పింఛన్దారులు తీవ్ర స్థాయిలో నిరాశకు గురవతుఉన్నారు. సర్కారు తీరు సరిగా లేదంటూ మండిపడుతున్నారు.
రేవంత్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యపు తీరును ఎండగడుతూ ఆందోళన బాట పడుతున్నారు. ఈమధ్య కాలంలోనే సర్కారు కళ్లు తెరిపించేందుకు దివ్యాంగులు భారీ ఎత్తున పోరాటం చేశారు. కలెక్టరేట్లను ముట్టడించి నిరసన చేపట్టారు. నెలకు రూ.6వేలు చొప్పున పించన్ పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చిన హామీని డిసెంబర్, 2023 నుంచి అమలు చేయాలని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రతి దివ్యాంగుడికి రూ.40వేలు చొప్పున ప్రభుత్వం బకాయి పడిందని చెబుతున్నారు. తక్షణం పించన్ పెంపుతో పాటుగా బకాయిలను సైతం అందించాలని కోరుతున్నారు.