మోర్తాడ్, జూన్ 23: రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదని, నిరంకుశ, నియంతృత్వ, నిర్బంధ పాలన అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేయకుండా గృహ నిర్బంధం, అక్రమ అరెస్టులతో వారి గొంతు నొక్కుతున్నదని మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని రైతులు యూరియా యాప్ రద్దు చేయాలని మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారని, వారి పిలుపుమేరకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి జాజాల సురేందర్ నాయకత్వంలో తాము అక్కడికి బయల్దేరేందుకు సిద్ధమవగా తనను హైదరాబాద్‌లోనే హౌస్ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు.
హౌస్ అరెస్ట్ చేసిన సందర్భంగా వేముల మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ, నిరంకుశ పాలనతో సాధించేదేమీలేదని పేర్కొన్నారు. తమను అరెస్టు చేసి తమ గొంతు నొక్కే బదులు అక్కడ రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అన్సీజన్లోనే దేశంలో ఎక్కడ యూరియా అందుబాటులో ఉన్నా, కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచేవారని గుర్తు చేశారు. రైతులు ఆటోవాలకు డబ్బులు ఇచ్చి పంపిస్తే నేరుగా పొలాల వద్దకే యూరియా వచ్చేదని తెలిపారు. రైతులకు ఎలాంటి కొరత లేకుండా యూరియా దొరికిందని, ప్రస్తుత ముఖ్యమంత్రికి ఆ తెలివిలేదన్నారు. దీంతో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడాల్సి వస్తున్నదని తెలిపారు.
సీఎం దృష్టి అంతా భూములపైనే..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి అంతా హైదరాబాద్‌లో భూములు ఎక్కడున్నాయి, వాటిని ఏం చేయాలనే దానిపైనే ఉంది తప్ప, రైతుల బాధలపై లేదని వేముల విమర్శించారు. మొన్నటివరకు వడ్ల కొనుగోలు కోసం రైతులను ఏడు చెరువుల నీళ్లు తాగించారని, ఇప్పుడు యూరియా కోసం ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నిరసన తెలుపుతామంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మంగళవారం వేకువజాము నుంచి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డిది ప్రజాపాలనా లేక నియంత పాలనా అనేది తెలంగాణ సమాజం, ప్రజాసంఘాలు ఆలోచించాలని కోరారు. ఎక్కడో కామారెడ్డి జిల్లాలో నిరసన ఉంటే హైదరాబాద్‌లో తమను అరెస్ట్ చేయడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. తమను అరెస్ట్ చేసినా రైతుల్లో వచ్చే తిరుగుబాటును మాత్రం అపలేరని, వారు తప్పకుండా బుద్ధిచెప్తారని హెచ్చరించారు.
రైతులను నట్టేట ముంచుతున్న ప్రభుత్వాలు
ఢిల్లీకి 72 సార్లు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి మెట్రో రైలుపైన సమావేశాలు పెట్టడానికి సమయం ఉంటుందని, కానీ కేంద్రప్రభుత్వాన్ని యూరియా గురించి అడిగే శ్రద్ధ లేదన్నారు. రేవంత్‌రెడ్డికి రైతులంటే చాలా చులకన భావం ఉన్నదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కూడా రాష్ర్టానికి రావాల్సిన యూరియాను ఒకేసారి ఇవ్వకుండా కోతలు విధిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా, ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు