మోర్తాడ్, మే 30: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా రుణాలను మంజూరుచేస్తున్నది. ప్రతిఏటా లక్ష్యాన్ని మహిళా సంఘాలు సాధ్యం చేసుకుంటున్నప్పటికీ ఈసారి నెరవేరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి. స్త్రీనిధి రుణాలతో పాటు బ్యాంకులింకేజీ రుణాలకు లక్ష్యం నిర్దేశించిన లక్ష్యం మేరకు ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ లక్ష్యాలను నెరవేరుస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలుస్తున్న జిల్లాలో ఈసారి కూడా నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకుంటారా అనే దానిపై ఆసక్తి నెలకొన్నది. గతేడాది జిల్లాకు స్త్రీనిధి లక్ష్యం రూ.211 కోట్లు కాగా రూ.216 కోట్ల వరకు మహిళాసంఘాలకు రుణాలు వివిధ వ్యాపారాల కోసం అందజేశారు. అయితే ఈ సంవత్సరం స్త్రీనిధి రుణ లక్ష్యం రూ.246కోట్లుగా అధికారులు నిర్ణయించారు.
జిల్లాలో మహిళాసంఘాల సభ్యులకు వ్యాపారాలపై అవగాహన కల్పిస్తూ వారిని ఐకేపీ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే స్త్రీనిధి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సంఘ సభ్యులతో వ్యాపారాలు ఏర్పాటు చేయించారు. ఇందులో ముఖ్యంగా టెంట్హౌస్లు, పిండివంటల తయారీ, కిరాణదుకాణాలు, బట్టల దుకాణాలు, క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇలా ప్రాంతాన్ని బట్టి మహిళలతో వ్యాపారాలు ఏర్పాటు చేయించారు. ఇప్పుడు కూడా అదే విధంగా గ్రామాలు, మండల కేంద్రాల్లో వ్యాపారాలు ఏర్పాటు చేయించేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు.
కానీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాలు అంతంతే కొనసాగుతున్న నేపథ్యంలో ఒక సంఘానికి కేవలం రూ.5లక్షల వరకు మాత్రమే వడ్డీ రాయితీ వచ్చే అవకాశం ఉండడం, మిగతా మొత్తానికి వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి కారణాలతో ఈసారి లక్ష్యం చేరుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మహిళాసంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఆసక్తి ఉన్నవారిని గుర్తించి వ్యాపారాలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.