వేల్పూర్, మార్చి 28: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ప్రజలను ఘోరంగా వంచించిందని మండిపడ్డారు. వేల్పూర్‌లోని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండున్నరేండ్లుగా వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారంటీల అమలు కోసం నిధులు కేటాయించకుండా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నదని విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి, వంద రోజుల్లోనే అమలు చేస్తామని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిన కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత వాటిని అటకెక్కించిందన్నారు. ప్రజలను నమ్మించడానికి ఆనాడు గ్యారంటీ కార్డులను పంచి మభ్యపెట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 25 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలు తక్కువ, ప్రచారం ఎక్కువ అన్న తీరున కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతుందన్నారు.
ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతి మహిళకూ రూ.2500 ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది కానీ ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 25 నెలలుగా రూ.2500 చొప్పున ప్రతి మహిళకూ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడిందని, వీటి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదనారు. దివ్యాంగుల పిన్షన్ రూ.6 వేలకు, వృద్ధులకు, బీడీ కార్మికుల పింఛన్ రూ.4 వేలకు పెంచుతామన్నారని, ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చినట్లే ఇస్తున్నారని గుర్తు చేశారు. బడ్జెట్లో పెన్షన్ల పెంపు ఊసే లేకుండా పోయిందన్నారు. రైతుభరోసా కింద రూ.15 వేల పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రూ.15 వేల సాయంతో పాటు రుణమాఫీ కానీ గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు.
రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు ఇస్తామన్నారని, బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధి హామీ కూలీలకు, ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని చెప్పినా, బడ్జెట్లో ఆ ప్రస్తావనే లేదన్నారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీ వంటి హామీల ఊసే లేకుండా పోయిందన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని విమర్శించారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలయ్యే వరకూ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు నాగంపేట్ శేఖర్‌రెడ్డి, బద్దం ప్రవీణ్‌రెడ్డి, కల్లెడ ఏలియా, దాసరి వెంకటేశ్, రేగుంట దేవేందర్, జైడి నాగధర్, బద్దం రవి, బద్దం నర్సారెడ్డి, రేగుల్ల రాములు, దొన్కంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేశ్, రాజా పూర్ణనందం, కొలిపాక ఉపేందర్, శ్రీకాంత్, గడ్డం స్వామి, ఏలేటి రమేశ్, ప్రతాప్, భోజపల్లి సురేశ్, లోలపు సుమన్, బురుకల కమలాకర్, డొల్ల రాజేశ్వర్, గంగారెడ్డి, నారాయణ, గంగాధర్, సూర్జీల్, శ్రీనివాస్, శంకర్‌గౌడ్, ఉమాశంకర్, ఆనంద్, యూసుఫ్, అశోక్ పాల్గొన్నారు.