Hanumanth Shinde | పెద్దకొడప్గల్, సెప్టెంబర్ 15 : గిరిజన ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జుక్కల్ నియోజకవర్గ స్థాయి గిరిజన నాయకులతో కలిసి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తీవ్రంగా మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 4383 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న సుమారు 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి, గిరిజన ప్రజలకు స్థానిక పాలనతో పాటు అభివృద్ధి చేశారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం ద్వారా గిరిజన ప్రజలకు పరిపాలనను సౌలభ్యం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.
గిరిజన కుటుంబాలకు అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎస్టీ ప్రజల సంక్షేమం కోసం 1682 ఎస్టీ ఆవాసాల నిర్మాణం కోసం రూ.1276 కోట్లు, 92 ఎస్టీ గురుకుల పాఠశాలల కోసం రూ.292 కోట్లు, మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణ కోసం రూ.133 కోట్లు, 237 మంది ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్యను అందించడానికి రూ.33.49 కోట్లు, 2,28,089 మంది ఎస్టీ మహిళలకు కేసీఆర్ కిట్టు కోసం రూ .151 కోట్లు, 14 24 మంది గిరిజన యువకులకు వాహనాలు కోసం రూ.101.50 కోట్లు, ఆదివాసి,బంజారాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రూ.50 కోట్లు,8,23,780 మంది ఎస్టీ రైతులకు రైతు బీమా రూ.7,354 కోట్లు, 4,93,720 మంది ఎస్టీ రైతులకు రైతు బీమా రూ.611 కోట్లు, గిరిజన వ్యవసాయానికి విద్యుత్ సరఫరా కోసం రూ .221 కోట్లు,3,75,316 మంది గిరిజన ప్రజలకు పింఛన్ల కోసం రూ.4,286 కోట్లు, 1,36,730 మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి రూ.1,126.61 కోట్లు, గిరిజన పంచాయితీ అభివృద్ధి పనుల కోసం రూ .1,837.08 కోట్లు, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం కోసం రూ .300 కోట్లు గిరిజనుల సంక్షేమ కోసం వివిధ రూపాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో వ్యాయామం కోసం అందించారన్నారు. 2022 లో ఎస్టీ రిజర్వేషన్ 6 నుంచి పదికి పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
2022 డిసెంబర్ నాటికి 19,698 మంది ఎస్టీ రైతులకు చెందిన 56,613 ఎకరాలను స్థాయిలోకి తీసుకువచ్చారన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్ 2023లో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించి ఎస్టీలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ ప్రతీ మండలంలో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసి అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పునర్ధరణ హామీ ఇచ్చారని, కానీ ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని, అబద్ధాలతో, నిందలు, బూతులతో పాలన సాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గిరిజన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింధన్నారు. గిరిజన ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించి, తండాలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మండలంలోని పెద్ద దేవిసింగ్ తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ప్రేమ్ సింగ్ నానమ్మ, బేగంపూర్ తండా చెందిన దన్ను నానమ్మ, హన్మంత్ షిండే చిన్ననాటి మిత్రుడు బేగంపూర్ గ్రామానికి చెందిన రాగేష్ కిషన్ ఇటీవల మృతి చెందారు. కాగా విషయం తెలుసుకున్న హన్మంత్ షిండే వారి కుటుంబాలను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్ద కొడప్ గల్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు విజయ్ దేశాయ్, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సీనియర్ నాయకులు సతీష్ యాదవ్,జుక్కల్ నియోజకవర్గం గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.