ఎల్లారెడ్డి/తాడ్వాయి, జూన్ 23:యూరియా కోసం రైతులు చేపడుతున్న నిరసనలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. యాప్ రద్దు కోసం పోరుబాట పట్టిన రైతులను, వారికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసుల సాయంతో అణగదొక్కుతున్నది. యూరియా యాప్ వద్దంటూ రోడ్డెక్కుతున్న రైతులకు బాసటగా తాడ్వాయిలో బీఆర్ఎస్ మంగళవారం తలపెట్టిన వంటావార్పు కార్యక్రమాన్ని రేవంత్ సర్కారు పోలీసు బలగాలతో అడ్డుకున్నది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. తాడ్వాయిని దిగ్బంధించిన వందలాది మంది పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు. తనిఖీల పేరిట సామాన్యులను సైతం ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా రైతులతో సహా చాలా మందిని అదుపులోకి తీసుకన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసి, ఠాణాల్లో నిర్బంధించారు. ఈ క్రమంలో పోలీసు జులుం ప్రదర్శించి నేతల పట్ల విచక్షణంగా ప్రవర్తించారు. శాంతియుత నిరసన కార్యక్రమంపై ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరును రైతులు, ప్రజలు తీవ్రంగా ఖండించారు.

రెచ్చిపోయిన ఖాకీలు..
బీఆర్ఎస్ నిరసనను అడ్డుకునే క్రమంలో పోలీసులు అతిగా ప్రవర్తించారు. ప్రజాప్రతినిధులతో పాటు రైతులను ఎత్తి వ్యాన్ల లో పడేశారు. ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కాళ్లు చేతులు పట్టుకుని లాక్కెళ్లి వాహనాల్లో ఎక్కించారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తోనూ అమానవీయంగా వ్యవహరించారు. సామాన్య రైతులా బైక్‌పై తాడ్వాయికి వచ్చిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఆయన కాళ్లు, చేతులు పట్టుకుని పోలీసు వాహనంలోకి నెట్టేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పెట్రోల్ బాటిళ్లతో వచ్చిన సొసైటీ చైర్మన్ కపిల్‌రెడ్డి, ఇతరుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. అమాంతం ఎత్తి కిందపడేసి లాక్కెళ్లారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
వేముల, షిండే హౌస్ అరెస్టు..
తాడ్వాయిలో చేపట్టిన వంటావార్పు కార్యక్రమానికి రాకుండా మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పోలీసులు హైదరాబాద్‌లో అడ్డుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలోనే హౌస్ అరెస్టు చేశారు. తాడ్వాయికి రాకుండా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండేను గృహ నిర్బంధం చేశారు. ఇక ఎల్లారెడ్డితో పాటు కామారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లోని గులాబీ నేతలను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుని ఠాణాలకు తరలించారు. పోలీసుల వైఖరిపై రైతులతో పాటు సామాన్యులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేషం మార్చి.. పోలీసులను ఏమార్చి..
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పోలీసుల కండ్లుగప్పి, చాకచక్యంగా తాడ్వాయికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని నివాసంలో ఆయనను హౌస్ అరెస్టు చేసేందుకు తెల్లవారుజామునే పోలీసులు చేరుకున్నారు. కానీ, ఆయన వారికి చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. తన ఫోన్ స్విచాఫ్ చేసి, డ్రైవర్‌ను, పీఏ వెంటబెట్టుకోకుండా వేరే వాహనంలో బయల్దేరారు. భిక్కనూరులో పోలీసులు అనుమానించగా, రూట్ మార్చి దోమకొండ మీదుగా పాల్వంచ నుంచి కామారెడ్డికి చేరుకున్నారు. వేషం మార్చి, పోలీసులను ఏమార్చి, ఓ కార్యకర్త బైక్‌పై సామాన్య రైతులా బయల్దేరారు. టేక్రియాల్, బ్రాహ్మణపల్లి, చందాపూర్ మీదుగా ఆయన తాడ్వాయికి చేరుకున్నారు. రైతు వేషంలో తలపాగా చుట్టుకుని సామాన్యుడిలా వందలాది మంది బలగాలను దాటుకుని వచ్చిన ఆయనను చూసి పోలీసులు బిక్కముఖం వేశారు. జై తెలంగాణ, జై బీఆర్ఎస్ అంటూ జాజాల ఆందోళనకు దిగడంతో తేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
దిగ్బంధంలో తాడ్వాయి..
యూరియా యాప్‌నకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ తాడ్వాయిలో మంగళవారం వంటా వార్పునకు పిలుపునిచ్చింది. దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసులను పురమాయించింది. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే బీఆర్ఎస్ నేతల ఇండ్లపై పడ్డారు. ఎల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, గాంధారి, కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్ తదితర మండలాల్లోని నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తాడ్వాయికి వచ్చే నాలుగు మార్గాలను దిగ్బంధించిన వందలాది పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, రాకపోకలపై నిఘా పెట్టారు. బస్సులు, కార్లు, ఇతర వాహనాలను తనిఖీ చేసి, అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, రైతులకు మద్దతుగా నిలిచిన తమను టెర్రరిస్టుల్లా అరెస్టు చేశారని నేతలు, రైతులు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సైతం పోలీసులు ఇలా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించలేదని, కానీ కాంగ్రెస్ పాలనలో పూర్తి వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.