నందిపేట్, డిసెంబర్ 4 : కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లుగా మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగానే చూసిందే తప్ప, వారి సంక్షేమానికి చేసింది శూన్యమని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్ విధానం కాగా కూల్చివేతలు, కాల్చివేతలు, పేల్చివేతలు కాంగ్రెస్ విధానమని మండిపడ్డారు.గురువారం ఆయన పట్టణంలోని జిరాయత్‌నగర్‌లో ‘నమస్తే ఆర్మూర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మైనార్టీలతో సమావేశమై వారి యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఫంక్షన్ హాల్ నిర్మాణం నిలిచిపోయిందని పలువురు మైనార్టీ పెద్దలు ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకుచ్చారు. వెంటనే ఆయన వారితో కలిసి ఫంక్షన్‌హాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని తొలగించారని మండిపడ్డారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌ను బెదిరించారని, అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే నిర్మాణ పనులను ఆపివేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్ రెడ్డి హుకూం జారీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయల నిధుల విడుదల కాకుండా అడ్డుపుల్ల వేసి నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇది కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్ రెడ్డికి సంబంధించి వెలుగు చూసిన మరో అవినీతి బాగోతమని పేర్కొన్నారు. ఇది తాను ప్రారంభించిన జనతా గ్యారేజీలో నమోదైన పైసా వసూలు రెడ్డి (పీవీఆర్) క్రైమ్ నంబర్ 3 అని వ్యాఖ్యానించారు. జనతా గ్యారేజీలో పలువురు మైనార్టీలు దీనిపై ఫిర్యాదు చేశారని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో వేలాది మంది మైనార్టీతో కలిసి మున్సిపల్ ఆఫీస్‌ను ముట్టడిస్తానని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల అక్రమాలపై కలెక్టర్ స్పందించాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మైనార్టీ ఫంక్షన్‌హాల్ నిర్మాణాన్ని అడ్డుకుంటున్న ఇద్దరు
నియోజకవర్గంలో పదేండ్లలో తాను చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ శిలాఫలకాలు తొలగించాలని కాంగ్రెస్ ఇన్చార్జి పీవీఆర్ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. మై నార్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం నిలిచిపోవడానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కూడా కారణమని, నిర్మాణ స్థలంపై కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, సీనియర్ నాయకులు పోల సుధాకర్, రాజేశ్వర్‌రెడ్డి, అజీమ్, అర్షాద్, సైఫ్ పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలో మైనార్టీలకు బడ్జెట్లో భారీగా కేటాయింపులు
కేసీఆర్ పదేండ్ల పాలనలో మైనార్టీలకు లెక్క లేనన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. షాదీముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిండ్లు చేశామని గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం చొప్పున ఇస్తామన్న హామీని తుంగలో తొక్కిందని విమర్శించారు. మైనార్టీల కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిన తొలిముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు.