నిజామాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నది. వైఫల్యాల సర్కారుకు అటు ఉపాధ్యాయులు, ఇటు పట్టభద్రులు కర్రుకాల్చి వాత పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రంగంలోకి దిగినా పార్టీ ఓడిపోయింది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సొంత ఇలాకలో జరిగిన తొలి ఎన్నికల్లో ఆయనకూ పరాభవమే మిగిలింది.
ఏడాది పాలనలోనే తీవ్ర వ్యతిరేకత కూడగట్టుకున్న హస్తం పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీలో అసమ్మతిని రేపు తున్నది. 42 అసెంబ్లీ సెగ్మెంట్లలోకి వచ్చే ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో.. ఇన్‌చార్జీలతో కలుపుకుని ఏడుగురు మంత్రులు, 23 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో పాటు పీసీసీ చీఫ్ సొంత జిల్లా కూడా ఈ నియోజకవర్గంలోనే ఉన్నప్పటికీ అధికార పార్టీ ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది. ఆధిపత్య పోరుతో చతికిలపడిన కాంగ్రెస్‌లో ఇప్పుడు అసంతృప్తి రాజుకుంటున్నది.
నిజామాబాద్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఓటర్లు పట్టించుకోలేదు. రైతు రుణమాఫీ అమలైతేనే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రైతు భరోసా వస్తేనే ఓటెయ్యాలని సూచించారు. వాస్తవానికి రుణమాఫీ, రైతు భరోసా పథకాలతో రైతు కుటుంబాలకు ప్రయోజనం దక్కింది స్వల్పమే. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సగానికన్నా ఎక్కువ మందికి రుణమాఫీ, పెట్టుబడి సాయమే అందలేదు. ముఖ్యమంత్రి చెప్పినట్లే పథకాలను అనుభవించని అనేక కుటుంబాల్లోని పట్టభద్రులు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టి కరిపించారు. సీఎం చెప్పినట్లే ఓటుతో తమ అసంతృప్తిని వెళ్లగక్కి సరైన రీతిలో గుణపాఠం చెప్పారని ఉమ్మడి జిల్లాలో చర్చించుకుంటున్నారు. పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ సొంత ఇలాకాలో ఆశించిన స్థాయిలో ఓట్లు రాకపోవడంతో ఆ పార్టీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నది.
కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. పట్టభద్రులుగా, ఉపాధ్యాయులుగా రెండు ఓట్లు వేసిన టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్లు నిఘా వర్గాలు సైతం గుర్తించాయి. టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయకున్నప్పటికీ పరోక్షంగా వంగా మహేందర్‌రెడ్డికి మద్దతిచ్చినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సానుభూతిపరుడిగా చెప్పుకున్న మహేందర్‌రెడ్డికి ఉపాధ్యాయులు ఓటేయలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉపాధ్యాయ లోకంలో గూడు కట్టుకున్న అసంతృప్తి ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒక్కసారిగా భగ్గుమన్నది. అధికారంలోకి రాక ముందు మాయమాటలు చెప్పిన రేవంత్ ఇప్పుడు తమ సమస్యలను పట్టించుకోకపోవడంపై టీచర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 15 నెలల కాలంలో డీఏలు మంజూరు చేయకపోవడంతో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు పీఆర్సీ అమలు అటకెక్కింది. అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాల పెంపుతో పాటు అనేక సమస్యలను పరిష్కరిస్తామంటూ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్‌రెడ్డి మాటిచ్చాడు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హామీలు అమలు చేయకపోవడంతో టీచర్లు తగిన రీతిలో బుద్ధి చెప్పారు.
15 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్కటంటే ఒక్క పథకమూ సరిగా అమలు కాలేదు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని ఘనంగా ప్రకటన చేశారు. 100 రోజుల్లోనే హామీలు అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ నిలదీతలతో ఆగస్టు 15లోగా అందరికీ రుణమాఫీ అని ప్రకటించారు. మార్చి వచ్చినప్పటికీ సగం మందికి కూడా మాఫీ చేయలేదు. ఉమ్మడి జిల్లాలో ఇంకా సుమారు 1.70 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక పెట్టుబడి సాయం సైతం ఇంత వరకూ సరైన రీతిలో అమలు కాలేదు. రేవంత్‌రెడ్డి గద్దెనెక్కాక మూడు పంట సీజన్లు గడిచి పోయాయి. ఈ యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం అందిస్తామంటూ సీఎం సహా మంత్రులు ప్రకటనలు చేశారు. సంక్రాంతి అన్నారు.. జనవరి నెలాఖరుకు అని మరోసారి చెప్పారు. మార్చి మొదటి వారం వచ్చినా ఇంకా వేయలేదు. మూడెకరాల్లోపు భూమి ఉన్న వారికి రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా కొంత మందికి మాత్రమే వచ్చింది. ఏటా ఎకరానికి రూ.15వేలు అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ రూ.12వేలకే పరిమితం చేయడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీంతో రైతు కుటుంబాల్లోని పట్టభద్రులు కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు.