స్వరాష్ట్రంలో సాగురంగం అద్భుతమైన పురోగతి సాధించింది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణ మాగాణి పచ్చబడ్డది. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా నెర్రెలు బారిన నేలలు.. పడావు పడ్డ భూములు.. ఎడారిని తలపించిన చెరువులు. కాలం కరుణించలేదు. పాలకులు పట్టించుకోలేదు. కరెంట్ కోతలు.. ఎండిన పంటలను చూసి రైతాంగం కుంగిపోయింది. భవిష్యత్తే కానరాని కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర నిత్యకృత్యమైంది. పొట్టచేత పట్టుకుని ముంబై వంటి నగరాలకు, ఎడారి దేశాలకు రైతాంగం వలస పోయింది. కానీ, తెలంగాణ రాకతో పరిస్థితి మారింది. కేసీఆర్ సీఎం అయ్యాక సాగురంగం మళ్లీ పట్టాలెక్కింది. చెరువుల పునరుద్ధరణ, ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి చింత తీరింది.
విద్యుత్ రంగ ప్రక్షాళనతో 24 గంటల కరెంట్ అందుబాటులోకి వచ్చింది. ధరణి రాకతో భూ పంచాయితీలు దూరమయ్యాయి. నాడు బీళ్లుగా మారిన భూముల్లో నేడు బంగారు పంటలు పండుతున్నాయి. రైతుల ఇండ్లల్లో సిరులు కురిపిస్తున్నాయి. అన్నదాతలు హాయిగా బతుకుతున్న తరుణంలో కాంగ్రెస్ కండ్లలో నిప్పు పోసుకుంటున్నది. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటలు చాలని, 10 హెచ్‌పీ మీటర్లు పెట్టుకోవాలని ఊదర గొడుతున్నది. రైతుల భూములకు రక్షణగా నిలిచిన ధరణిని ఎత్తేస్తామని ఊరూరా చాటింపు వేయిస్తున్నది. తమ బతుకులను మళ్లీ ఆగం చేసేందుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై రైతాంగం మండిపడుతున్నది. మూడు గంటల కరెంట్ అని మమ్మల్ని ముంచడానికి వస్తున్న హస్తం పార్టీకి ఓటుతో షాకిస్తామని అన్నదాతలు చెబుతున్నారు. రైతు నేస్తం కేసీఆర్‌కే మా మద్దతు అని స్పష్టంచేస్తున్నారు.
వ్యవసాయానికి మూడు గంటల కరెంటు, బోర్లల్లో 10హెచ్‌పీ మోటర్లు వాడాలంటున్న కాంగ్రెసోళ్లపై అన్నదాతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన ఘటనలు యాది మరువలేదని, పాముకాట్లు, కరెంటు షాక్‌లతో చనిపోయిన రైతుల ముఖాలు ఇంకా గుర్తున్నాయని చెబుతున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో, సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయానికి నాణ్యమైన 24గంటల కరెంటు ఉచితంగా ఇవ్వడంతోనే మా ముఖాల్లో వెలుగులు వచ్చాయని, సంతోషంగా జీవిస్తున్నామని రైతులు పేర్కొంటున్నారు. మీరొద్దు.. మీ కరెంటు వద్దురా బాబోయ్ అంటుంటే.. మళ్లీ వచ్చి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉన్న మోటర్లు పీకేసి.. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని కాంగ్రెసోళ్లు ఇస్తున్న ఉచిత సలహాపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అధికారంలో లేనప్పుడే రైతులపై అక్కసు వెళ్లగక్కుతున్న ఈ కాంగ్రెసోళ్లకు పగ్గాలు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. మమ్మల్ని కాపాడింది.. మా మేలు కోరిందీ కేసీఆరే.. ఆయనకే మా మద్దతు ఉంటుందని స్పష్టంచేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అరకొర విద్యుత్‌తో రైతులు నానా తంటాలు పడ్డాం. విద్యుత్ సరిగా అందకపోవడంతో మోటర్లన్నీ ఒక్కసారిగా చాలు చేయడంతో కొన్ని మోటర్లు కాలిపోయి రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే పంటలు పండేవి. లేకపోతే వదిలేద్దామనే పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో ఏ ఒక్క రైతు పొలం ఇంత వరకు ఎండిపోయిన దాఖలాలు లేవు. తెలంగాణ ప్రభుత్వంలోనే రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ను కాదని మళ్లీ పాత కష్టాలు కొని తెచ్చుకోలేము.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ కరెంట్‌కు కష్టాలు వస్తాయ్. కరెంట్ మీద కాంగ్రెసోళ్లు ఒక్కో నాయకుడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నాం అంటారు. ఇక్కడి వచ్చి వ్యవసాయానికి మూడు గంటలు సరిపోతుందని.. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నారు. అధికారంలోకి వస్తే అసలు కరెంటు ఎన్ని గంటలు ఇస్తారో వారికే తెలియదు. వ్యవసాయం, విద్యుత్ సరఫరాపై వాళ్లకు అస్సలు అవగాహన లేదు. వాళ్ల మాటలు నమ్మి మోసపోతే తర్వాత తిప్పలు పడాల్సింది మనమే.
కోటగిరి, నవంబర్ 24 : పొరపాటున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ కోసం రేయింబవళ్లు ఎదురు చూడాల్సిందే. గతంలో వారి పాలనలో రైతులు అరిగోసపడ్డారు. తెలంగాణ వచ్చాక పంటలకు కరెంట్ సరిపోను ఉంటున్నది. సీఎం కేసీఆర్ సార్ దూరదృష్టితో కరెంట్ కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులు చల్లగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వచ్చి అది చేస్తాం. ఇది చేస్తామని మాయమాటలు చెబుతున్నారు. వాటిని నమ్మితే మళ్లీ మోసపోతాం. మూడు గంటల కరెంట్ ఇస్తే ఏ మూలన నీళ్లు పారుతాయి…? కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులే దాపురిస్తాయి. కేసీఆర్ సర్కారే మళ్లీ రావాలి.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నది. దీంతో రైతులకు పంటలు బాగా పడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు ఎక్కువగా ఉండేవి. అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయి. పొలాల ఎండిపోతాయి. రైతులకు మళ్లీ ఆత్మహత్యలే శరణ్యం అవుతాయి. అందుకే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. రైతులమంతా కేసీఆర్ వెంటే ఉంటాం.
మూడు గంటల కరెంటుతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయి. 24 గంటలు విద్యుత్‌తో రెండు పంటలు పండించుకుంటున్న రైతు ఆనందంగా ఉన్నాడు. 10 హెచ్‌పీ మోటర్లు, మూడు గంటలు కరెంట్ అంటున్న కాంగ్రెస్ మాటలతో ఒరిగేది ఏమీలేదు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి 24 గంటలు కరెంట్ ఇచ్చే ప్రభుత్వాన్ని వదులుకుంటే నోళ్లు తెరిచిన బీడు భూములే దర్శనమిస్తాయి. ఉచిత విద్యుత్‌తో 24గంటలకు ఇచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. పోచారం సారూకే మా ఓటు వేస్తాం. మళ్లీ సీఎం కేసీఆర్ సారె రావాలి..
కరెంటు విషయంలో కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే నిండా మునిగిపోతాం. కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చుతోటి మంచిగా పంటలు పండించుకుంటున్నాం. కాంగ్రెసోళ్లు ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు అస్తుండె.. పోతుండె. వ్యవసాయం అంటేనే విరక్తి కలిగేది. దీంతో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటోళ్లు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయం పండుగలా మారింది. నీరు పుష్కలంగా ఉండడంతో దిగుబడి కూడా పెరిగింది. కాంగ్రెస్ వాళ్లు ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో రైతులకు మళ్లీ పాత రోజులే వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తది. కాంగ్రెస్‌ను ఎట్టి పరిస్థితిల్లో నమ్మం.
ఉచితం కరెంటుతో పంటలను మంచిగా పండించుకుంటున్నాం. కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంట్ ఇస్తే ఎకరం పొలం కూడా నీరు పారదు. 10 హెచ్‌పీ మోటర్లు వేస్తే బోరు నుంచి నీళ్లు సరిగ్గా రావు. నీటి ఊటలు తగ్గి.. మోటర్లు కాలిపోతాయి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. రైతులను రాజు చేస్తున్నది సీఎం కేసీఆర్ సార్. మేమంతా బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేస్తాం. కేసీఆర్ సార్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాం.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంటల కరెంట్ రైతులకు ఊపిరిపోస్తుంది. ఆనాడు రాత్రిపూట నీళ్లు పెట్టడానికి చేనుకు వెళ్తే పురుగుబూసి కుట్టకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకునేవాళ్లం. ఇప్పుడు అలాంటి భయం లేదు.మళ్లీ ఆ రోజులు వస్తే రైతు కుటుంబాల్లో అంధకారమే. వచ్చీరాని కరెంట్‌తో మోటర్లు కాలిపోయేవి. పంటలు ఎండిపోయి పెట్టుబడులు కూడా రాక ఆర్థికంగా నష్టపోయేది. సరిగ్గా దిగుబడులు లేక అప్పులే మిగిలేవి. రైతుబంధు పెట్టుబడి సాయం, ఉచిత కరెంట్‌తో మా కష్టాలు తొలిగిపోయాయి. కాంగ్రెసోళ్లు చెబుతున్నట్లు మూడు గంటల కరెంట్ పది సాళ్లను తడపడానికి కూడా సరిపోదు. మాకు మాటలు చెప్పే నాయకులు వద్దు..చేతలు చేసి చూపించే కేసీఆర్ లాంటి నాయకుడే కావాలి.
వర్ని, నవంబరు 24 : బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినంక ఎవుసానికి కడుపునిండా కరెంటు ఇస్తుండ్రు. మేము రెండు పంటలు రంది లేకుండా పండించుకుంటున్నాం. ఇప్పుడు కరెంటు విషయంలో ఏ సమస్యా లేదు. మళ్లీ ఇప్పుడు కాంగ్రెసోళ్లు అచ్చి మూడు గంటలు కరెంటు చాలు, 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటున్నారు. కాంగ్రెస్ హయాంలో మేము పడ్డ కష్టాలు ఇప్పుడిప్పుడే మరిచిపోతున్నాం. కాంగ్రెసోళ్లు వస్తే మళ్లీ అప్పటి కష్టాలు తప్పవు. అప్పుడు ఎవుసం బంద్ పెట్టుకునుడే అయితది.
అప్పట్ల రాత్రి పూట కరెంటు తోటి పొలం కాడనే పండుకొని పొద్దుగాళ్ల ఇంటికి వచ్చేటోడ్ని. ఇంటికి అచ్చేదాక ఇంటోళ్లకి భయం ఉంటుండె. కేసీయార్ సర్కార్ అచ్చినంక 24 కరెంట్తోటి పొద్దుగాళ్ల పూటనే నీళ్లు పారిచ్చి అస్తున్నా. మళ్లా ఈ ఎన్నికల లొల్లి రాంగానే 10 హెచ్‌పీ మోటర్ పెడతా, మూడు గంటల కరెంటు ఇస్తా అని రైతులకు ఆగం చేస్తే రేపు ఓట్లతో కాంగ్రెసోళ్లకు బుద్ధి చెబుతాం.
సీఎం కేసీఆర్ మా కష్టాలను గుర్తించి ఇబ్బందులు లేకుండా చేశారు. 24 గంటలు కరెంట్‌తో పాటు రైతుబంధు, రైతురుణమాఫీ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి రైతులకు కేవలం 3 గంటల కరెంట్ సరిపోతుందని అనడం సిగ్గుచేటు.10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే దాదాపు రూ.లక్ష ఖర్చు వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటు వేసి మళ్లీ కష్టాలు కొనితెచ్చుకోవద్దు.
చందూర్, నవంబర్ 24 : కాంగ్రెస్ హయాంలో అరిగోస పడ్డాం. బీఆర్ఎస్ గవర్నమెంటు అచ్చినంకనే ఎవుసం దారిల వడుతున్నది. మళ్లా కొత్తగా రేవంత్‌రెడ్డి మూడు గంటల కరంటు, 10హెచ్‌పీ మోటర్లు అంటున్నడు. ఆయన దిమాక్ ఖరాబ్ అయింది. మూడు గంటలు కరంటు సరిపోతదా? ఎవుసానికి ఎవ్వళ్లన్న 10హెచ్‌పీ మోటర్లు వెడుతరా? మళ్లా మా బతుకలల్ల చిచ్చువెడతామంటే సూసుకుంట ఉంటామా?
కాంగ్రెస్ ఇస్తామన్న మూడు గంటల కరెంట్ వ్యవసాయానికి సరిపోతదా ? రైతులు 10 హెచ్‌పీ మోటర్లు కొనాలంటే లక్ష రూపాయలకుపైగా ఖర్చవుతుంది. మళ్లీ అప్పులు కావాల్సి వస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ రైతుల కోసం 24 గంటల కరెంటు ఇస్తున్నారు. రైతులంతా సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని డ్రామాలాడుతున్నది. రైతులు ఎవ్వరూ కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మరు. రైతుబంధు, రైతుబీమా ఇస్తున్న సీఎం కేసీఆర్‌కే రైతులు అండగా ఉంటారు.
గత ప్రభుత్వాలు విద్యుత్ సక్కగ ఇయ్యక పంటలు ఎండిపోవాటుండె. సీఎం కేసీఆర్ ఎక్కినంక 24గంటల కరెంటు ఇస్తుండ్రు. గిప్పుడు నేను కూరగాయలు పండించి నా కుటుంబాన్ని పోషించుకుటున్నా. మళ్లా కాంగ్రెస్ గిన అచ్చిందంటే కంరెంటు ఇయ్య చేతగాక మా పంటలు ఎండగొడ్తరు.. మా కడుపుల మట్టిగొడ్తరు. ఎవుసం బంద్ చేసుకునుడయితది. మంచిగ కరంటు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకే అచ్చే ఎలచన్ల ఓటు వేస్తాం.
నా చిన్ననాటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. కాంగ్రెసోళ్లు ఉన్నప్పడు కరెంటు కోసం పడరాని పాట్లు పడ్డాం. ఇప్పుడిప్పుడే వ్యవసాయం పండుగలా మారుతున్నది. ఇప్పుడు మళ్లా కొత్తగా 3 గంటల కరెంట్ సరిపోతుందని , 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని కాంగ్రెసోళ్లు అంటుండ్రు. 10 హెచ్‌పీ మోటరు పెట్టుడంటే ఉట్టిగనే అయితదా. ఒక వేళ పెట్టినా భూమిలో నీళ్లన్నీ ఒక్కదెబ్బకు ఇంకిపోతాయి. మళ్లా కరువు పరిస్థితులు వస్తాయి. అసలు రైతుల బాధ వారికి తెలిస్తే ఇలాంటి పిచ్చి కూతలు కూయరు. రైతు పడే బాధ ఏందో వారు చూసి ఉండరు. రైతులను ఆగం చేయాలని చూస్తే ఊరుకోం.