బోధన్ రూరల్/ నాగిరెడ్డిపేట, ఆగస్టు 1: రుణమాఫీ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. రెండో విడుతలోనూ అర్హులైన వేలాది మందికి నిరాశే మిగిలింది. రెండు విడుతల్లో కలిపి రూ.లక్షన్నర లోపు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కానీ కొందరికే మాఫీ వర్తించగా, చాలా మందికి ఆశభంగమే ఎదురైంది. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే లక్షన్నర కాదు కదా.. రూ.30-40 వేల లోపు ఉన్న చాలా మంది రైతుల లోన్లు మాఫీ కాలేదు. పట్టా పాస్‌బుక్, ఆధార్, రేషన్ కార్డు వివరాలన్నీ సరిగా ఉన్నప్పటికీ వారి పేరు జాబితాలో లేదు. దీంతో ఏం చేయాలో తోచక బ్యాంకులు, ఆఫీసుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అటు బ్యాంకర్లు, ఇటు అధికారుల నుంచి సరైన సమాధానం దొరకక, కాంగ్రెస్ పాలనలో గిట్లనే ఉంటుందని నిరాశగా వెనుదిరుగుతున్నారు.
రుణమాఫీ రెండో జాబితా అంతా గందరగోళంగా ఉన్నది. నాకు ఎకరం 20 గుంటల పొలం ఉన్నది. నేను రూ.లక్ష లోన్ తీసుకున్న. లక్షన్నరలోపు ఉన్న వారికి మాఫీ అని చెప్పిండ్రు. కానీ అధికారులు ఇచ్చిన లిస్టులో నా పేరు లేదు. మాఫీ వస్తాదో.. రాదో అర్థమైతలేదు.
– రాము, రైతు, కల్దుర్కి, బోధన్ మండలం
మోస్రా కెనరా బ్యాంక్‌లో రుణం తీసుకున్న. నాలోన్ రూ. లక్షపైన ఉన్నది. రెండో జాబితాలో పేరు ఉందోమేనని చూస్తే లేదు. లోన్ మాఫీ అయితుందని మస్తు ఆశపడ్డ. కానీ లిస్టులో పేరు రాకపోవడం బాధగా ఉన్నది. రుణమాఫీ చేయాలి.
-అబ్దుల్ దారు, రాజీవ్‌నగర్ తండా, బోధన్ మండలం
మాకు ఏడెకరాల భూమి ఉన్నది. నా భార్య, నా పేరుపైన రెండు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నాం. నా రేషన్ కార్డుపై ఆత్మకూర్ గ్రామ మహిళ పేరును సొసైటీ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో నాకు రుణమాఫీ రాలేదు. అధికారులు చుట్టూ తిరిగినా స్పందించడం లేదు. మా గ్రామంలో 160 కుటుంబాలకు నాగిరెడ్డిపేట కో-ఆపరేటివ్ బ్యాంకు, ఎల్లారెడ్డి ఎస్బీఐలో రుణాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 50 మందికే మాఫీ వచ్చింది.
– చిలుకూరి కరుణాకర్‌రెడ్డి, రైతు, వెంకంపల్లి