ఉమ్మడి నిజామాబాద్‌లో జిల్లాలో రూ.రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కాలేని రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..అర్హులైన తమకు మాఫీ చేయలేదని అసహనం వ్యక్తంచేస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొదటి విడుతలో 49,540 మంది రైతులకు రూ.231.13 కోట్లు రుణమాఫీ అయ్యాయి.
రెండో విడుతలో 24,816 మంది రైతులకు రూ.211.72 కోట్లు, మూడో విడుతలో 17,543మంది రైతులకు రూ.212.52కోట్లు మాఫీ అయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మూడు విడుతల్లో మొత్తం 91,899 మంది రైతులకు రూ.655.37 కోట్లు మాఫీ అయ్యింది. పలు గ్రామాల్లో కొందరికి మాఫీ అయి.. మరికొందరికి మాఫీ రాకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. రుణమాఫీ అంతా గందరగోళంగా ఉన్నదని, వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లను అడిగితే కల్లబొల్లి మాటలు చెబుతున్నారని పేర్కొంటున్నారు.
రైతులకు రుణమాఫీ రంది పట్టుకున్నది. ఒకటో విడుతలో రాని వారికి రెండో విడుతలో వస్తుందని, రెండో విడుతలో రాని వారికి మూడో విడుతలో వస్తుందని చెప్పిన మాటల్లన్నీ కల్లబొల్లివేనని తేలిపోయింది. రూ.2లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. అర్హతలున్నా కొర్రీల పేరిట మాఫీ వర్తింపజేయలేదంటూ రైతులంతా మండిపడుతున్నారు. మూడు విడుతల్లోనూ అర్హులైన తమకు నిరాశే మిగిలిందని నిట్టూరుస్తున్నారు. చివరి విడుతలోనైనా మాఫీ వస్తుందనుకున్న తమను ఈ కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
– కామారెడ్డి/ కామారెడ్డి రూరల్, ఆగస్టు 18
నా కొడుకు, నేను విడి విడిగా ఉంటాం. నా భా ర్య పేరు మీద మూడు ఎకరాల భూమికి రూ.రెండు లక్షల లోన్ ఉన్నది. నా కొడుకు పేరు మీద, నా పేరు మీద రూ. 2లక్షల రుణం ఉన్నది. కుటుంబానికి రూ.రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెసోళ్లు చెప్పిండ్రు. కానీ మా ఇంట్లో ఎవరికీ రుణమాఫీ చేయలేదు.
– లింగుపల్లి నారాయణ, తిమ్మక్‌పల్లి,కామారెడ్డి మండలం
మాటలు చెప్పారు..రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు మాటలు చెప్పింది. నా పేరు మీద మూడు ఎకరాల భూమి ఉంటే రూ.లక్షా 50 వేల లోన్ తీసుకున్నాను. అయినా నాకు రుణమాఫీ కాలేదు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మా అప్పులను మాఫీ చేసి ఆదుకోవాలి.
– దాక రాజమణి, రైతు, తిమ్మక్‌పల్లి
దేశానికి వెన్నుముఖలాంటి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు మాఫీ చేయకుండానే మాట తప్పుతున్నది. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి. లేదంటే రైతులకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదు.
– ద్యావరిశెట్టి నారాయణ, రైతు, తిమ్మక్‌పల్లి
అధికారంలోకి రాకముందు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది. మాకు ఐదు ఎకరాల పొలం ఉన్నది. రూ.రెండు లక్షల వరకు లోన్ తీసుకున్నాను. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు రుణాలను మాఫీ చేస్తామని చెప్పడంతో కట్టకుండా ఉన్నాం. మూడు విడుతలు అయిపోయినా నాకు రుణమాఫీ రాలేదు. ఇప్పుడు తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
– భాస్కర్, రైతు, తిమ్మక్‌పల్లి
వేల్పూర్, ఆగస్టు 18: ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో రుణమాఫీ మాకు కాలేదని చెబితే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయుమని చెబుతున్నారు. గిదేమి పద్ధతి. సీటు మీద కూర్చోక ముందు ఒకటి.. కూర్చున్నాక ఒకటి… ఇది సరైంది కాదు. రుణమాఫీ అందరికీ ఇవ్వాలి.
– మామిడి గంగారాం, దొన్కల్, మోర్తాడ్
వేల్పూర్, ఆగస్టు 18: రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేసిన తర్వాత మోసం చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ప్రమాణం చేసి చెప్పారు. ఇప్పుడేమో కొందరికే రుణమాఫీ చేశారు. దేవుళ్ల మీద ఒట్లు వేసి మోసం చేసిన పార్టీ అధికారంలో ఎక్కువ రోజులు ఉండదు.
– దమ్మాయి గంగాధర్, వేల్పూర్