కంఠేశ్వర్, జూన్ 10: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అనంతరం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు పెద్దసంఖ్య లో తరలివచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 135 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పాలనాధికారి రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను పరిష్క రించాలని కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఆర్డీవో సాయాగౌడ్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు, వినతులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు.
హాజరుశాతం మినహాయింపు ఇవ్వాలి
విద్యాశాఖ ఆధ్వర్యంలో వేసవికాలంలో ప్రతి సంవత్సరం నిర్వహించే టీటీసీ శిక్షణలో హాజరును 95శాతం నుంచి 75శాతానికి మినహాయింపు ఇవ్వాలని విద్యార్థులు ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. టీటీసీ శిక్షణకు ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి తదితర దూర ప్రాంతాల నుంచి వస్తున్నందున సమయానికి రాలేకపోతున్నామని తెలిపారు. అధికారులు 95శాతం హాజరు ఉన్నవారికే డెమో క్లాసులకు అవకాశం ఇస్తున్నారని, వేసవికాలం దృష్ట్యా అనారోగ్యాలతో సరిగ్గా హాజరుకాలేదని, 75శాతం హాజరుశాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అంతకు ముం దు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.