నవీపేట/పొతంగల్, అక్టోబర్ 13: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు పోరుబాట పట్టారు. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవీపేట మండలం యంచ వద్ద బాసర రహదారిపై సోమవారం మహాధర్నా నిర్వహించగా.. నష్టపరిహారంతోపాటు బోనస్‌పై స్పష్టత ఇవ్వాలని కోరుతూ పొతంగల్ మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు.
యంచ వద్ద చేపట్టిన ధర్నాలో నవీపేట మండలంలోని కోస్లీ, మిట్టాపూర్, యంచ, అల్జాపూర్, నందిగామ, బినోలా, నిజాంపూర్, తుంగినీ, నాళేశ్వర్ తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు పాల్గొనగా..వారికి బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భారీ వర్షాలకు నష్ట పోయిన పంటలకు ఎకరానికి రూ.50 వేల పరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితోపాటు ఎంపీ అర్వింద్ అలసత్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన స్వార్థ రాజకీయంతోనే ఎగువ ప్రాంతం నుంచి గోదావరికిలోకి వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుకూలంగా దిగువకు వరదను విడుదల చేయలేదన్నారు. దీంతో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌తో నవీపేట మండలంలో గోదావరి పరీవాహక గ్రామా ల్లో ఐదు వేల ఎకరాలకు పైగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపునకు గురై రెండు నెలలు కావస్తున్నా పట్టించుకోవడంలేదన్నారు.
ఇప్పటికైనా నష్టపరిహారం అందించాలని లేనిపక్షంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. యంచ బాసర రహదారిపై రాస్తారోకోతో ఇరువైపులా పెద్దమొత్తంలో వాహనాలు నిలిపిపోయాయి. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ వెంకటరమణ, ఎస్సై తిరుపతి, ఏవో నవీన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. నాయకులు వి.నర్సింగ్‌రావు, తెడ్డు పోశెట్టి, దోంత ప్రవీణ్‌కుమార్, ద్యాగ సరిన్, పిల్లి శ్రీకాంత్, శైలేశ్ కుమార్, మగ్గరి హన్మాండ్లు, శైలేశ్ కుమార్, రాజేశ్వర్, సాయాగౌడ్, డి. సంజీవ్, గొల్ల లాలు యాదవ్, రైతులు పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవడంలో చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతాం. స్థానిక ఎమ్మె ల్యే సుదర్శన్‌రెడ్డి పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారు. నష్ట పోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం. బాధిత రైతులకు మా పార్టీ అండగా ఉంటుంది.
రాజేశ్వర్, సీపీఐ నాయకుడు
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తన స్వార్థ రాజకీయాలతో ఎస్సారెస్పీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన ఇన్‌ఫ్లోను దిగువకు విడుదల చేయకపోవడంతో గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలోని పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలి.
-వి.నర్సింగ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు