Road construction | కంటేశ్వర్ : నిజామాబాద్ మహాలక్ష్మి కాలనీ సాయి టవర్స్ వాసులు చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ కార్యదర్శి బాల్ రావు మాట్లాడుతూ.. తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొంత కాలంగా రోడ్డు గుంతలమయంగా మారడంతో పలువురు గుంతల్లో పడి గాయపడినట్లు చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీళ్లు చేరడంతో పరిస్థితి మరింత దిగజారిందన్నారు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన కరువైందన్నారు.
దీంతో సాయి టవర్స్ అపార్ట్మెంట్ వాసులే చందాలు వేసుకుని రోడ్డుపై ఏర్పడిన గుంతలను మట్టితో పూడ్చి ప్రయాణానికి అనుకూలంగా మలిచినట్లు తెలిపారు. కాలనీలో డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం లేదన్నారు. అధికారులు సమస్యలు పరిష్కరించకుటే ఇంటి పన్నులు సైతం చెల్లించవద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి టవర్స్ వెల్ఫర్ సొసైటీ అధ్యక్షుడు మహేశ్, కోశాధికారి రాజు, సలహాదారులు సింహాచలం, సంజీవరెడ్డి, వరుణ్ కుమార్ పాల్గొన్నారు.