డిచ్పల్లి, ఏప్రిల్ 30: తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 3న నిర్వహించనున్న నీట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం పరిశీలించారు. కళాశాల పరీక్షా కేంద్రాన్ని కలియదిరిగి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి పరీక్ష సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ రాంబాబు, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి, సిబ్బంది ఉన్నారు.
వినాయక్‌నగర్, ఏప్రిల్ 30: జిల్లాలో నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మోడల్ సైన్స్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ మే 2న నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రం వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సాయిచైతన్య గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని ఆర్సపల్లి పరిధిలో శనివారం జరిగే పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో 63 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షా కేంద్రం పరిసరాల ప్రాంతాల్లో 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు, స్టేషనరీ షాప్స్ మూసి ఉంచాలని సీపీ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని, సెంటర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని సీపీ వెల్లడించారు.