గీసుగొండ, సెప్టెంబర్ 5: ఇకపై పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద అన్నారు. గురువారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని హర్జ్యతండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
జిల్లాలో మోడల్ అంగన్వాడీ కేంద్రంగా హర్జ్యతండా సెంటర్‌ను ఎంపిక చేసినట్లు ఆమె చెప్పారు. ఈ నెల 9న అంగన్వాడీ కేంద్రాల్లో ప్రాథమిక విద్య అమలు కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో ప్రారంభిస్తారని వివరించారు. ఈ మేరకు జిల్లాలోని హర్జ్యతండా అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపిక చేశామన్నారు. ఈ సెంటర్లో 12 మంది పిల్లలున్నారని, మూడో తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యను అందిస్తారని చెప్పారు. అంగన్వాడీ టీచర్‌తోపాటు మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించే ఆవకాశాలు ఉన్నాయన్నా రు.
కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ స్టేట్ జాయింట్ డైరెక్టర్ అకేశ్వర్రావు, పోషణ అభియాన్ స్టేట్ కన్సల్టెంట్ శివాల్కర్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్, సీడీపీవోలు విశ్వజ, డేబోరా, తహసీల్దార్ రీయాజుద్దీన్, ఇన్చార్జీ ఎంపీడీవో కమలాకర్, ఆర్ఐ సాంబయ్య, అంగన్వాడీ టీచర్ సరోజన తదితరులు పాల్గొన్నారు.