కంఠేశ్వర్, ఫిబ్రవరి 10 : పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల రిటర్నింగ్ అధికారు లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన్లో, బోధ న్ డివిజన్ ఆర్వోలు, సహాయ ఆర్వోలకు బోధన్ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం వేర్వేరుగా మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.
ఎన్నికల కమిషన్ ప్రకటననుసరిస్తూ రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానా ల ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అనువుగా ఉండే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముందుగానే ఎంపిక చేసుకుని నోటిఫికేషన్లో స్పష్టంగా వివరాలను పొందుపర్చాలని సూ చించారు. సమయపాలనను పక్కాగా పాటిస్తూ నామినేషన్ల స్వీకరణ కేంద్రం గదిలో తప్పనిసరిగా గోడ గడియారం అందుబాటు లో ఉండేలా చూసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనలకనుగుణంగా పక్కాగా జరిగితే పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహ తో, ఆర్డీవో రాజేంద్రకుమార్, డీపీవో శ్రీనివాస్, డీఈవో అశోక్, డీఎల్పీవోలు పాల్గొన్నారు
కామారెడ్డి, ఫిబ్రవరి 10: కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని అధికారులకు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలకు అధికారులను సమాయత్తం చేస్తూ పలు సూచనలు అందజేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పాల్గొన్నారు.