కంఠేశ్వర్, కామారెడ్డి, ఫిబ్రవరి 25: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఈ నెల 27న నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆశీష్సంగ్వాన్ తెలిపా రు. మంగళవారం వారు వేర్వేరుగా మాట్లాడా రు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 31,571 మంది ఓటర్లుండగా ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 3751 మంది ఉన్నారని తెలిపారు.
పట్టభద్రుల నియోజకవర్గానికి 48,ఉపాధ్యాయ సెగ్మెంట్‌కు 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం ఉపాధ్యాయ, పట్టభద్రుల పోలింగ్ స్టేషన్లు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 16,410 మంది, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 2011 మంది ఓటర్లు ఉన్నారని కలెక్టర్ ఆశీష్సంగ్వాన్ తెలిపారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్నవారు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పరిశీలించారు. మంగళవారం ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 25 : ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సింధూశర్మ మంగళవారం తెలిపారు. ఎన్నికల కోసం నలుగురు డీఎస్పీలు, 80 మంది సీఐలు, 33 మంది ఎ స్సైలు, 58 మంది ఏఎస్సైలు,హెడ్ కానిస్టేబుళ్లు,174 మంది కానిస్టేబుళ్లు,35 మంది హోంగార్డులు మొత్తం 312 మంది సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని అన్నారు.ఎన్నికల సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100, 200 మీటర్ల పరిధిలో ఎన్నికల నియమావళి ప్రకారం ఆంక్షలు ఉంటాయని పేర్కొన్నారు.