కామారెడ్డి/కంఠేశ్వర్/ఖలీల్‌వాడి, నవంబర్ 16: గ్రూప్-3 పరీక్షలకు ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆది, సోమవారాల్లో నిర్వహించనున్న పరీక్షలకు నిజామాబాద్ జిల్లాలోని 66 కేంద్రాల్లో 19,941 మంది అభ్యర్థులు, కామారెడ్డి జిల్లాలోని 20 కేంద్రాల్లో 8,268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం సెషన్లో మరో పరీక్ష ఉంటుందని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.
కాపీయింగ్‌కు అవకాశం లేకుండా మూడు కేంద్రాలకు ఒకరు చొప్పున 22 మంది ఫ్లయింగ్ స్కాడ్లను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, నిర్దేశిత సమయానికంటే గంట ముందు నుంచే లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆర్మూర్ వైపు నుంచి వచ్చే అభ్యర్థులు అడవి మామిడిపల్లి వద్ద ఆర్యూబీ పనుల నేపథ్యంలో వాహనాల మళ్లింపును దృష్టిలో ఉంచుకుని ముందుకు రావాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ, ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపారు. సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలన్నారు.