కంఠేశ్వర్/బోధన్/బాన్సువాడ/ఎల్లారెడ్డి రూరల్, జనవరి 27: మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేకాధికారుల పాలన షురూ అయ్యింది. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. నిజామాబాద్ నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతును నియమించగా, సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ దిలీప్‌కుమార్, ఇతర అధికారులు ప్రత్యేకాధికారి, కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. బోధన్ మున్సిపల్ అధికారిగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అంకిత్ బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్‌లోని తన కార్యాలయంలో సంబంధిత ఫైళ్లపై స్పెషలాఫీసర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సంతకాలు చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ ప్రత్యేకాధికారిగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు.