జక్రాన్‌పల్లి/ బాల్కొండ, జూన్ 4: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆన్లైన్లో నమోదు చేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం ఉండొద్దని సూచించారు. రెవెన్యూ బృందాలు సమయపాలన పాటిస్తూ.. రైతులు, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. జక్రాన్‌పల్లి మండలం మాదాపూర్, బాల్కొండ మండలం కిసాన్‌నగర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా అధికారులు స్వీకరిస్తున్న దరఖాస్తులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. వారి సందేహాలను నివృత్తిచేశారు. రైతులకు సరిపడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని, ఒకే దరఖాస్తులో రైతులు రెండు, మూడు రకాల సమస్యలను పేర్కొనవచ్చని తెలిపారు. అన్ని దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 14వ తేదీ వరకు సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.