బోధన్, జూలై 14: ప్రభుత్వ దవాఖానకు వచ్చే వారికి మెరుగైన వైద్య చికిత్సలు నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వైద్యులకు సూచించారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానను ఆదివారం సందర్శించిన ఆయన.. నూతనంగా వచ్చిన రెండు డయాలసిస్ మెషిన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, గతంలో ఐదు డయాలసిస్ మిషన్లు ఉండగా, కొత్తగా మరో రెండు మిషన్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
దీంతో రోజుకు సగటున ఇరవై మందికి డయాలసిస్ సేవలు అందించవచ్చని స్థానిక వైద్యులు కలెక్టర్‌కు వివరించారు. చుట్టు పక్క గ్రామాలు, మండలాల నుంచి డయాలసిస్ కోసం ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో ఏడుగురికి డయాలసిస్ చేయవచ్చని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ దవాఖానాలపై నమ్మకాన్ని పెంచాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. అనంతరం దవాఖానలోని ఆర్వో ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డుతోపాటు ఇతర విభాగాలను పరిశీలించారు. దవాఖానలో ఉన్న ఇన్పేషెంట్లను పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
వైద్యుల కొరత ఉంటే కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం కోసం ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు దవాఖానలో సీజనల్ వ్యాధుల నివారణకు సరైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రహీం, ఆర్ఎంవో డాక్టర్ రాహుల్, బోధన్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ కె. గంగాధర్ పాల్గొన్నారు.