కంఠేశ్వర్, అక్టోబర్ 17 : జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధితశాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో సీపీ కల్మేశ్వర్ సింగేనవార్తోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై సమావేశంలో చర్చించి, వాటి నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ సూచనలు చేశారు.
జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి విక్రేతలతోపాటు దానిని వినియోగించే వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. మత్తు పదార్థాలు మాదకద్రవ్యాల వినియోగంతో కలిగేఅనర్థాలపై ప్రజలు, విద్యార్థులకు వివరిస్తూ విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈసారి గంజాయి కేసులు కొంతవరకు తగ్గాయని సీపీ కల్మేశ్వర్ తెలిపారు.