కామారెడ్డి, జూన్ 13: మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి అని, ఇక్కడి ప్రజలు కుల,మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకొనే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉన్నదని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17న బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనా స్థలాలు, వధశాలల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడంతోపాటు బ్లీచింగ్ పౌడర్‌ను చల్లాలని మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులకు సూచించారు.
నిబంధలనకు విరుద్ధంగా వివిధ వాహనాల్లో పశువులను తరలిస్తే వెంటనే సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు అధికారులకు సూచించారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఐదు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెట్టామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్డీవోలు రంగనాథరావు, రమేశ్ రాథోడ్, జిల్లా పశు సంవర్ధక అధికారి సింహారావు, డీపీవో శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.