ఎల్లారెడ్డి/రామారెడ్డి, ఫిబ్రవరి 29: వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యతని, ఎల్లారెడ్డిలోని మెట్ల బావిని పునరుద్ధరిస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మెట్లబావిని గురువారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. సుమారు 380 ఏండ్ల క్రితం నిర్మించిన బావి శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని బాగుచేసి మంచి నీటిని నిల్వ చేసుకునేలా తయారు చేస్తామన్నారు. బావులను బాగు చేసేందుకు రూ.50వేలు మంజూరు చేశారు. మెట్లబావి పునరుద్ధరణకు మార్చి 3న శ్రమదానం చేయాలని, పట్టణంలోని యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట రెయిన్ వాటర్ ప్రాజెక్టు ఫౌండర్ కల్పనారమేశ్, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ సిద్దార్థ ముఖర్జీ, తహసీల్దార్ మహేందర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఆలయ ధర్మకర్తలు సిద్ధి శ్రీధర్, రాజేశ్వర్, సూర్య ప్రకాశ్ ఉన్నారు.
రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో ఐకేపీ రుణంతో ఏర్పాటు చేసిన చేపల కుంటను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ గురువారం పరిశీలించారు. మ హిళల ఆర్థికాభివృద్ధికి ఇలాంటి వాణిజ్య పంటలు అవసరమని చెప్పారు. నిర్వాహుకులు లక్ష్మీఆనంద్ దంపతులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీఆర్డీవో చందర్‌నాయక్, మత్స్యశాఖ డెవలప్మెంట్ ఆఫీసర్ రమేశ్‌బాబు, ఎంపీడీవో సవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.