కామారెడ్డి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగీడుతూ ఉత్సాహ పూరిత వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమరుల ఆశయాలు,ఆకాంక్షల మేరకు రాష్ర్టాన్ని, జిల్లాను అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. అంతకముందు పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న అమరవీరుల స్థూపానికి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధూశర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రైనీ ఏఎస్పీ కాజల్ సింగ్, అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, వైస్ చైర్పర్సన్ వనిత, జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్‌కుమార్, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.