పెద్దకొడప్గల్, అక్టోబర్ 10: అధికారులు పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన పిట్లం మండల కేంద్రంలో పర్యటించారు. డంపింగ్ యార్డు, ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. డంపింగ్ యార్డు నిర్వహణ అధ్వానంగా ఉందని, అధికారుల పనితీరు సక్రమంగా లేదని ఆగ్రహం వ్యకంచేశారు. ఎంపీవో యాదగిరి, పంచాయతీ కార్యదర్శి యాదగిరికి నోటీసులు జారీ చేయాలని డీఎల్పీవో నాగరాజును ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ దవాఖానకు వెళ్లి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పనికిరాని పరికరాలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. దవాఖానలో టాయిలెట్స్ లేవని వైద్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు. ఎల్ఆర్ఎస్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో కమలాకర్, తహసీల్దార్ వేణుగోపాల్, వైద్యులు రవీంద్ర కుమార్, విజయ లక్ష్మి తదితరులు ఉన్నారు.