కామారెడ్డి/కంఠేశ్వర్, అక్టోబర్ 3 : ధాన్యం కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణ, డీఎస్పీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియపై ఆయన గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతానికి భిన్నంగా ఈసారి సన్నరకం, దొడ్డురకం ధాన్యం కొనుగోలుకు వేర్వేరు కౌంటర్లు, కాంటాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. వెంటవెంటనే ధాన్యం తూకం, తరలింపు ప్రక్రియ చేపట్టాలన్నారు.
డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పకడ్బందీగా పూర్తి చేయాలని, దసరా కంటే ముందే నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు. వీసీ కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి, నిజామాబాద్ కలెక్టర్లు ఆశీష్ సాంగ్వాన్, రాజీవ్‌గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్, ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, అంకిత్, కిరణ్‌కుమార్, అధికారులు సురేందర్, రాజేందర్, తిరుమల ప్రసాద్, సాయాగౌడ్, అర్వింద్‌రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో 356 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం సమీక్ష అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. అవసరమైతే కేంద్రాలను పెంచాలని, సన్న వడ్లను సెపరేట్‌గా కొనుగోలు చేయాలన్నారు. సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద తలెత్తే సమస్యల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నం. 08468-220051 ఏర్పాటు చేసినట్లు వివరించారు.