లింగంపేట/నాగిరెడ్డిపేట్/ఎల్లారెడ్డి రూరల్, నవంబర్ 5: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండలంలోని మెంగా రం, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలంలోని మేల కుంట తండా. తాండూర్, ఎల్లారెడ్డి మండల పరిధిలోని శివ్వాపూర్ గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని పరిశీలించి తూకం వేయాలని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటది వెంట రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
ధాన్యం తరలింపులో లారీల కొరత రాకుం డా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్కు సూచించారు. ధాన్యం తూకం వేసిన వెంటనే రైతు, బ్యాంకు ఖాతా వివరాలను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రెండు, మూడు రోజు ల్లో రైతులకు డబ్బులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.