ఖలీల్‌వాడి, నవంబర్ 24 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కొన్నిరోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో 31.1 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా..కనిష్ఠ ఉష్ణోగ్రత 15.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతుండడంతో గజగజ వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంటున్నది.
సాయంత్రం 5 దాటిందంటే చలి తీవ్రం అవుతున్నది. కొన్నిచోట్ల చలి కారణంగా ఉదయం, సాయంత్రం పొగమంచు అలుముకోవడంతో పాటు చల్లని ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జిల్లా ప్రజలు వణుకుతున్నారు. ఉదయం భానుడు వచ్చే వరకు చలి ఉంటున్నది. ఇప్పుడే చలి ఇంతగా ఉంటే మరో రెండు నెలల పాటు మరెంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఉదయం 7.30 గంటలకే తరగతులు ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా స్కూల్ బస్సులు ఉదయం 6 నుంచే మొదలు కావడం, చలి ఎక్కువగా ఉంటుండడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండడంతో కుటుంబీకులు ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆహారం వేడిగా ఉన్న సమయంలోనే తీసుకోవడం ఉత్తమం. ఆస్తమా ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. వ్యాధుల బారిన పడకుండా ప్రతిఒక్కరూ స్వెటర్, మంకీ క్యాపు వాడాలి.
-జలగం తిరుపతి రావు, ఎండీ, ఫిజీషియన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రొఫెసర్