ఖలీల్వాడి నవంబర్12: నాలుగైదు రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. వారం క్రితం వరకు వర్షం దంచికొట్టగా.. ఒకేసారి చలి గాలులు ప్రారంభమయ్యాయి. జిల్లాను చలి వణికిస్తున్నది. వారం నుంచి చల్లని వాతావరణం ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా రోజురోజుకూ పడిపోతున్నాయి. ఉదయం ఎనిమిది వరకు చలి తీవ్రత ఉండగా.. సాయంత్రం ఐదు గంటల నుంచి వణుకు పుట్టిస్తున్నది. మరోవైపు సాయంత్రం ఐదున్నరకే చీకటి పడుతున్నది. పొద్దున సూర్యోదయం అయిన గంట వరకు కూడా చలి తీవ్రత తగ్గడం లేదు.
వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో చిన్నా పెద్ద తేడా లేకుండా అందరికీ విషజ్వరాలు వస్తున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామాల్లోని ప్రజలు ఆర్ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. శీతల గాలులు వీయడంతో చలి తీవ్రత పెరిగిందని, చిన్న పిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప చలిగా ఉన్నప్పుడు పిల్లలను బయటికి తీసుకు రావొద్దని చెబుతున్నారు.
మాస్క్లు, స్వెటర్లు ధరించాలని, వెచ్చగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. సీజన్ మార్పుతో ఇన్ఫెక్షన్లు సులభంగా వస్తాయని, చల్లని వాతావరణం వైరస్ పెరిగేందుకు అనుకూలంగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. దీంతో జ్వరాలు, ఇతర వ్యాధుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చలికాలంలో ప్రతి పది మందిలో ఒకరికి జలుబు, దగ్గు, జ్వరం కనిపిస్తాయని అంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మం దులు అందుబాటులో ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో వాతావరణం మరింత చల్లబడుతుందని, చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణం చల్లబడడంతో గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు చలిమంటలు కాపుకుంటున్నారు. సాయంత్రం ఆరు దాటితే చలి తన ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తున్నది. దీంతో ప్రజలు మంటలు వేసుకొని వెచ్చదనాన్ని పొందుతున్నారు. ప్రయాణం చేసే వారు కూడా అక్కడక్కడ ఆగి మంటలు కాపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శరీరం నిండా ఉన్ని దుస్తులు ధరించి, వేడిగా ఉండేలా చూసుకుంటున్నారు.
వాతావరణం చల్లబడడంతో వైరల్ ఫీవర్ వస్తుంది. వెంటనే డాక్టర్ను సంప్రదించి తగిన చికి త్స చేయించుకోవా లి. మూడు రోజుల వరకు వైరల్ ఫీవర్ ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. దగ్గర్లో ఉన్న పీహెచ్సీ, యూ పీహెచ్సీల్లో డాక్టర్లను సంప్రదించి, తగిన మాత్రలు వాడితే సరిపోతుంది. ప్రతి సెంటర్లో మందులు అందుబాటులో ఉన్నాయి.
-రాజశ్రీ, డీఎంహెచ్వో, నిజామాబాద్
పరిశుభ్రత పాటిస్తూ.. తినే ముందు చేతలను శుభ్రంగా కడుక్కోవాలి. జ్వరం, జలుబు వారం రోజులుగా తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. భయపడాల్సిన పనిలేదు. మందులు వాడితే తగ్గిపోతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూలు దుస్తులు ధరించాలి. మాస్క్లు, స్వెటర్లు వేసుకోవాలి.
-జలగం తిరుపతిరావు, వైస్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ