ఖలీల్‌వాడి, నవంబర్ 3 : దివ్యాంగుల కోసం ప్రకటించిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ వద్ద ఆదివారం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెన్షన్‌దారులను నట్టేట ముంచిందన్నారు.
వారితో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ సర్కార్‌కు పెన్షన్‌దారులు కనబడడం లేదన్నారు. అధికారంలోకి వచ్చి పది నెలల దాటినా దివ్యాంగులకు పెంచిన పెన్షన్లను ఇవ్వలేదని మండిపడ్డారు. వారం రోజుల్లో 10 నెలల చేయూత పెన్షన్‌ను విడుదల చేయాలని, హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని గల్లీ నుంచి రాజధాని హైదరాబాద్ వరకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నెల 16 వరకు రోజుకు రెండు జిల్లాల వారీగా పెన్షన్ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే 17 నుంచి 23 వరకు అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ ఇవ్వకపోతే 26న పెన్షన్‌దారుల పోరాట దినంగా ప్రకటిస్తామని తెలిపారు.
చేయూత పెన్షన్దారులందరినీ, రాజకీయ అఖిల పక్షాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తామని వెల్లడించారు. అదే రోజు ఇందిరాపార్కు వద్ద లక్షలాది మంది దివ్యాంగులతో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, బీడీ, గీతా కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీరప్ప, షేక్ షరీమ్, కృష్ణవేణి, సతీశ్‌కుమార్, సాయిలు, వంశీ, సాయన్న పాల్గొన్నారు.
మా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరకు వస్తున్నా.. ఇప్పటివరకు పెన్షన్ పెంచి ఇవ్వలేదు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను వెంటనే అమలు చేయాలి. లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
-స్వరూప, ధర్మారం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దివ్యాంగుల పేరు ఎత్తడం లేదు . కనీసం పెన్షన్ విషయం కూడా మాట్లాడడంలేదు. దివ్యాంగులపై చిన్న చూపు చూడకుండా అన్ని పథకాలను వర్తింపజేస్తూ, పెంచిన పెన్షన్ అమలు చేయాలి.
-లింగన్న, బోర్గాం