ఉమ్మడి జిల్లాలో ‘ఇసుకాసురుల’కు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినా..క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కొన్నిరోజులుగా ఇసుక దందాలో కేటుగాళ్లు రూటు మార్చారు. ప్రభుత్వ నిర్మాణాల పేరిట తీసుకుంటున్న వేబిల్లులను అడ్డు పెట్టుకొని ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు జీరో దందాతో చెలరేగి పోయిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరగణం ఇప్పుడేకంగా వే బిల్లుల పేరిట మాయాజాలం చేస్తున్నది. ఇందుకు రెవెన్యూ శాఖ ఉద్యోగులు బాహాటంగా సహకారం అందిస్తున్నారు. తాజాగా బోధన్‌లో ఓ ఇసుక వ్యాపారి ఆడియో లీకేజీ బయటికి రావడంతో ఇసుక దందాలో ఎంతటి అవినీతి జరుగుతున్నదో తేటతెల్లమైంది. వేబిల్లుల జారీ కోసం తహసీల్దార్లు యథేచ్ఛగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆడియోలో ఇసుక వ్యాపారి ప్రధానంగా ఆరోపణలు చేయడం గమనార్హం.
-నిజామాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉమ్మడి జిల్లాలో ఇసుకాసురులకు కొంతమంది తహసీల్దార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడి యథేచ్ఛగా వే బిల్లులు జారీ చేస్తున్నారు. ఈ అక్రమ తంతుపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవరిస్తుండడం అక్రమార్కులకు కలిసివస్తున్నది. బోధన్ వ్యవహారంలో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తే రెవెన్యూ లీలలు బహిర్గతమయ్యే ఆస్కారం ఉంది. కానీ నిజామాబాద్‌లో ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం, కండ్ల ముందే సహజ వనరులను అక్రమార్కులు కొల్లగొడుతున్నప్పటికీ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను ఉమ్మడి జిల్లాలో బుట్టదాఖలు చేస్తున్నారు. కలెక్టర్ల నుంచి కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగి వరకూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. సహజ వనరులను కొల్లగొట్టే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని సీఎం పదేపదే చెబుతున్నారు. సొంత పార్టీకి చెందిన నేతలైనా వదిలేదిలేదని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నది. సీఎం ఆదేశాలతో ఇన్చార్జి సీపీగా, కామారెడ్డి ఎస్పీగా సింధూ శర్మ ఉన్నప్పుడు తూతూ మంత్రంగా ప్రెస్‌నోట్ విడుదల చేశారు. అక్రమార్కులను వదిలేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ నియంత్రణ చేయలేకపోయారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కొత్త సీపీ, ఎస్పీలు వచ్చారు. ఇసుక అక్రమాలపై వారి ఫోకస్ ఎలా ఉండబోతుందనేది ఇంకొన్ని రోజులైతే కానీ తెలిసే పరిస్థితి కనిపించడం లేదు. సీఎం ఆదేశాలను కలెక్టర్లు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఒక వే బిల్లు పేరిట పదింతల ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేందుకు ముందు రెవెన్యూ శాఖలో అధికారుల తీరుపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అనుమతి లేకుండా ఇసుకను తరలించరాదు. సరైన పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే ప్రజలెవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఇసుక అక్రమాలను నియంత్రించే అధికారం మాకన్నా ఎక్కువగా రెవెన్యూ శాఖకే ఉన్నది. రెవెన్యూ శాఖనే పూర్తి బాధ్యత వహిస్తుంది. తహసీల్దార్ల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించాలి. ఇసుక అక్ర మంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకుని మాకు అప్పగిస్తే మేము పెనాల్టీ విధిస్తాం.
– విజయ్ కుమార్ రాథోడ్, గనులు, భూగర్భ శాఖ అధికారి, నిజామాబాద్
ఉమ్మడి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో ఉన్న మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ జోరుగా సాగుతున్నది. అధికారిక క్వారీలు మూసేసి దొడ్డి దారిన దోపీడీని కాంగ్రెస్ పాలకులు ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వానికి రూ.కోట్లలో రావాల్సిన ఆదాయం పడిపోగా అక్రమార్కుల జేబులు మాత్రం రోజూ గలగలమంటున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్న ఇసుక మాఫియాకు పలువురు రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లి, బాన్సువాడ, నస్రుల్లాబాద్, కోటగిరి, పొతంగల్, బోధన్ మండలాల్లో రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. బోధన్ డివిజన్లో తహసీల్దార్‌గా పని చేసి అప్రతిష్టను మూటగట్టుకున్న ఓ అధికారి ఇప్పుడు మంజీరా పరీవాహక ప్రాంతంలో తిష్టవేశాడు. తనకు ఇష్టమొచ్చినట్లుగా వేబిల్లులు జారీ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నాడు. కామారెడ్డి జిల్లాలో తాజాగా జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో మంజీరా పరీవాహక ప్రాంతానికి ఓ ప్రజాప్రతినిధితో పైరవీ చేయించుకుని ఓ తహసీల్దార్ పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఇసుక అక్రమాలకు రాచబాట వేసేందుకు సదరు అధికారి వచ్చినట్లు రెవెన్యూ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా ముద్రపడిన సదరు అధికారికి ఓ పోలీసు అధికారి మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. ఇద్దరు కలిసి ఇసుకను కొల్లగొట్టే ప్రణాళికను ప్రజాప్రతినిధి అండదండలతో రచిస్తున్నట్లుగా తెలిసింది. గతంలో బోధన్ డివిజన్ కేంద్రంలో పని చేసి ఇప్పుడు బాన్సువాడ డివిజన్లో పని చేస్తున్న తహసీల్దార్ సైతం పాత్రధారిగా నిలుస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. రెవెన్యూ శాఖలో కళంకితులుగా ముద్రపడిన సదరు అధికారులందరూ మంజీరాలో తిష్టవేసినా నిఘా వర్గాలు పట్టించుకోకపోవడం గమనార్హం.