ఉద్యమ ఆకాంక్షల నుంచి పురుడుపోసుకున్న భారత రాష్ట్ర సమితి తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన మ్యానిఫెస్టో.. ప్రజల మ్యానిఫెస్టోగా సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత రెండు ఎన్నికల్లో బంగారు తెలంగాణ రూపకల్పనలో మ్యానిఫెస్టోను రూపొందించి వందశాతం అమలు చేసిన
బీఆర్ఎస్ సర్కారు.. మూడోసారి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మ్యానిఫెస్టోను రూపొందించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
రాష్ట్ర ప్రగతికి దోహదం చేయడంతోపాటు ప్రజల ఆత్మవిశ్వాసాన్ని చూరగొంటున్న సీఎం కేసీఆర్.. తాజా మ్యానిఫెస్టోతో మరోసారి రైతులు, మహిళలు, నిరుపేదలు, ఆసరా లబ్ధిదారులకు భరోసానిచ్చారు. పంట పెట్టుబడి పెంపు, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం, పేదలకు ఆరోగ్య, జీవిత బీమా, ఆసరా పింఛన్ల పెంపు, మహిళలకు జీవన భృతి, రూ.400కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత తదితర హామీలను సకల జనులు ఆహ్వానిస్తున్నారు. పేద, బడుగు బలహీనవర్గాల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా మ్యానిఫెస్టో ఉన్నదని పేర్కొంటున్నారు.
-మెండోరా/బోధన్ రూరల్, అక్టోబర్ 17
రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను తయారు చేశారు. రైతుబంధు కింద రైతులకు ఎకరానికి సంవత్సరానికి క్రమంగా రూ.16వేలకు పెంచుతామని చెప్పడం సంతోషంగా ఉన్నది. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబానికి తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం ఇస్తామని చెప్పడం ఆనందంగా ఉన్నది.
– మోహన్ నాయక్, రైతు, రాజీవ్‌నగర్ తండా
నిజామాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన ఎన్నికల హామీలు ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఇప్పటికే బీఆర్ఎస్ సర్కారుకు ప్రశంసలు దక్కుతున్నాయి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి నమూనాను యావత్ దేశంలోని రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయి. ఆఖరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించే మోదీ సర్కారు సైతం కేసీఆర్ తీసుకు వచ్చిన పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చుకుంటు న్న సందర్భాలు సైతం ఉంటున్నాయి.
గడిచిన పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సుభిక్షంగా వెలుగొందుతున్నది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి ముందుకు సాగుతున్నాయి. ఈ దశలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పరుగులు తీస్తున్నది. ప్రజల మద్దతుతో దక్షిణ భారతదేశంలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును బద్దలు కొట్టేందుకు గులాబీ అధినేత కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇందులో పొందుపర్చిన హామీల చిట్టా జనానికి ఎంతగానో మేలు చేసే విధంగా ఉండడంతో ఎటు చూసినా కేసీఆర్ హామీలపైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కేసీఆర్‌తోనే సామాన్యులకు మేలు జరుగుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు.
మెండోరా, అక్టోబర్ 17: కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో తెల్లరేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పడం అందరికీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటి కన్నా అదనంగా మరో 2కిలోలు ఇప్పటికే ఎక్కువ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో సన్నబియ్యం ఇస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం. కేసీఆర్ అన్నివర్గాల ప్రజలకు తోడు ఉండేలా సన్నబియ్యం అందజేయడం హర్షణీయం.
– ఎర్ర భాస్కర్, పోచంపాడ్
నిజాంసాగర్, అక్టోబర్ 17 : మరోమారు అధికారంలోకి రాగానే రైతుబంధు సాయం పెంచుతామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించడం హర్షణీయం. రైతుబంధు సృష్టికర్తే కేసీఆర్.. అలాంటిది రైతులకు పెట్టుబడి సహాయం పెంచుతానని ప్రకటించారు. మొదటి సంవత్సరం రూ.12వేలు, ఐదేండ్లలో రూ.16వేల వరకు పెంచుతామని చెప్పారు. చెప్పినట్లుగానే కేసీఆర్ పెట్టుబడిసాయం పెంచుతారు. ఆయన మాటపై నమ్మకం ఉన్నది. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపిస్తాం.
– శ్రీకాంత్ రెడ్డి, రైతు, గోర్గల్
కేసీఆర్ సార్ మ్యానిఫెస్ట్టోలో గ్యాస్ సిలిండర్‌కు రాయితీ ప్రకటించడం చాలా బాగున్నది. కేంద్ర ప్రభుత్వం ఓ వైపు సిలిండర్ల ధరలను పెంచుతుంటే కేసీఆర్ సార్ రూ.400కే సిలిండర్ ఇస్తామని ప్రకటించడం సంతోషకరం. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల బాధను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. కేసీఆర్ నిర్ణయం మహిళల్లో సంతోషాన్ని నింపింది. వచ్చే ఎన్నికల్లో మహిళల ఆశీర్వాదంతో విజయం సాధిస్తారు.
-మ్యాకల విజయ్‌కుమార్, నిజాంసాగర్
బోధన్ రూరల్, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్ తెలంగాణ భవితకు భరోసా కల్పించేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న రైతుబంధును అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఎకరానికి రూ.12 వేలకు పెంచుతామని చెప్పడం సంతోషకరం. దీనిని క్రమక్రమంగా రూ.16వేలకు పెంచుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారు.
– రామయ్య, రైతు, పెగడాపల్లి
ఆరోగ్యశ్రీ పథకం గరిష్ఠ పరిమితి రూ.15లక్షలకు పెంచడంతో సామాన్య ప్రజలకు మరింత మేలు కానున్నది. ఇప్పటికే వైద్యా న్ని మరింత అందుబాటులో తీసుకువచ్చి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. మరోమారు ఆయనను సీఎం చేస్తే ఆరోగ్య శ్రీ పథకంతోపాటు వైద్య సేవలు మరింత మెరుగవుతాయి. రూ.5లక్షల ఉన్న పరిమితిని అధికారంలోకి వస్తే రూ.15లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
– విఠల్‌గౌడ్, మగ్దుంపూర్
బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ధాన్యం కొనుగోలు పాలసీని యదావిధిగా కొనసాగిస్తామని ప్రకటించడం హర్షణీయం. రైతుబంధు పథకం తీసుకువచ్చిన పార్టీ బీఆర్ఎస్, రైతు పెట్టుబడి సహాయం పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో రైతులు మరింత సంతోషంగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తానని ప్రకటించడంతో రైతులు మారోమారు ఆయనకే పట్టం కడతారు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం.
– వాజిద్ అలీ, చైర్మన్, గున్కుల్ సొసైటీ
కేసీఆర్ బీమా, రేషన్ దుకాణాల్లో పేదలకు సన్నబియ్యం, రూ.400లకే గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్ల మొత్తం పెంపు, రైతుబంధు రూ.16వేలు, మహిళలకు రూ.3వేల భృతి, కేసీఆర్ ఆరోగ్య రక్ష, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, అసైన్డ్ భూముల ఆంక్షలు ఎత్తివేత, ఉద్యోగుల పెన్షన్ పథకం కోసం కమిటీ ఏర్పాటు వంటి అంశాలతో పాటు పాత పథకాల అమలు ప్రకటనతో బీఆర్ఎస్కు జనాల్లో అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నది. విధి వంచితులు, అనాథ బాలలు, కర్షకులు, కార్మికులు, సామాన్యులు, జర్నలిస్టులకు ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సంక్షేమ సమాహారంగా కేసీఆర్ మ్యానిఫెస్టోను ప్రకటించారు.
వ్యవసాయ జిల్లాగా పేరొందిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ల్లో ఈ మ్యానిఫెస్టోకు ప్రజలంతా ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా రైతుల నుంచి విశేషమైన మద్దతు వస్తున్నది. దేశంలో ఏ పాలకుడు అమలు చేయని విధంగా తొలిసారి పెట్టుబడి ఖర్చులకు రైతుబంధును అమలు చేసిన కేసీఆర్ ఇప్పుడేకంగా ఆ మొత్తాన్ని రూ.16వేలకు పెంచబోతున్నట్లు వెల్లడించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో పురుడు పోసుకున్న రైతుబంధు పథకం ఏడాదిన్నర కాలంలోనే రెండో ప్రభుత్వంలో వేయి రూపాయలు పెరిగింది. మూడోసారి అధికారంలోకి వస్తే రైతుబంధు సాయం రూ.16వేలు అవుతుందన్న కేసీఆర్ ప్రకటనను రైతులంతా సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
పేదల పెన్నిధి కేసీఆర్ అన్నట్లుగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ హయాంలో వృద్ధులకు రూ.200 మాత్రమే పింఛన్ అందేది. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులతో పాటు ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులు, బీడీ టేకేదార్లు ఇలా అనేక వర్గాలకు పింఛన్లు అందిస్తోంది. బోటాబోటి పింఛన్లు అందించి చేతులు దులుపుకోకుండా రూ.2016 చొప్పున అమలు చేస్తోన్న ఆసరా పింఛన్లను ఏకంగా రూ.5016 వరకు దశల వారీగా పెంచబోతున్నట్లుగా చెప్పడంతో సామాన్యుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
దివ్యాంగులకు రూ.6వేల పింఛన్ హామీతోనూ వారికి కొండంత భరోసా కలిగింది. గతంలో దేశా న్ని, రాష్ర్టాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు పేదల గురించి ఆలోచించలేదు. ఎప్పుడూ అభాగ్యుల మేలు కోసం పింఛన్లను సమృద్ధిగా ఇవ్వలేదు. ఎన్నికల కోసం ఇష్టానుసారంగా హామీలు గుప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతుందన్న అభిప్రాయం జనాల్లో పెరుగుతున్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ సామాన్యులకు మేలు కన్నా కీడు ఎక్కువ జరిగింది. ఇంధన, ఎల్పీజీ వంట గ్యాస్ ధరల పెంపుతో అన్ని వర్గాలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. దీంతో బీజేపీతో మేలు జరుగుతుందన్న నమ్మకం జనాల్లో పూర్తిగా సమసి పోయింది. రూ.400లకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఇస్తామని కేసీఆర్ చెప్పడం మహిళామణులంతా జయహా కేసీఆర్ అంటూ కీర్తిస్తున్నారు.
తెలంగాణను బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన యోధుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించిన ఘనుడు కేసీఆర్. కొట్లాడి తెచ్చిన తెలంగాణను బంగారుమయం చేసి ప్రజలకు మేలు చేస్తున్న మొనగాడు కేసీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లుగా ప్రస్తుతం మన రాష్ట్రంలో రాజకీయం మారిందంటే అతిశయోక్తి కాదు. నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయభేరి మోగించడం ఖాయమన్న విషయాన్ని సర్వేలు జోస్యం చెబుతున్నాయి. విపక్షాలకు చెందిన నేతలు కూడా ఈసారి మళ్లీ కేసీఆర్ సర్కారే వస్తుందని అంగీకరిస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఇక్కడి ప్రజలకు అనుభవ సూచకమే. అందుకే మరోసారి కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలన అనేక సంక్షేమ పథకాలతో తమ జీవన విధానంలో మార్పునకు కారణమైందని ప్రజల నమ్మకంగా కనిపిస్తోంది. అలాంటి కేసీఆర్‌ను కాదని, కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇస్తే గోసపడతామనే భయం జనాన్ని వెంటాడుతున్నది. అందుకే ప్రజలంతా నవంబర్ 30న జరిగే పోలింగ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు కారు గుర్తుపై ఓటేద్దామన్నంతగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. నాడు ఉద్యమాన్ని నడిపి విజయతీరం చేర్చిన కేసీఆర్… నేడు స్వరాష్ర్టాన్ని ప్రగతి పథంలో తీరం చేర్చారు. పరిపాలనాదక్షుడిగా కేసీఆర్‌కు ఎనలేని గుర్తింపు వచ్చింది. గులాబీ పవనాలు వీస్తున్న ఈ తరుణంలో మ్యానిఫెస్టోలో ప్రకటించిన వరాలు ప్రజలను మరింతగా గులాబీ పార్టీకి దగ్గర చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తుండడం విశేషం.