బీర్కూర్, ఫిబ్రవరి 26: బీర్కూర్ మండలకేంద్రం శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురా ర్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి-పుష్పమ్మ దంపతులు అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, శ్రీవిశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, అంకురార్పణ హవనం, రుత్విక్వరణం తదితర పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శంభురెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచా రం సురేందర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
బాన్సువాడ, ఫిబ్రవరి 26 : తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల ఆలయ బ్రహ్మోత్సవాలకు మార్చి ఒకటిన సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. బాన్సువాడ పట్టణంలో హెలిప్యాడ్, వసతి గృహం, రోడ్లు తదితర వసతులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వారి వెంట అదనపు కలెక్టర్ చంద్రమోహన్ , ఆర్డీవో రాజాగౌడ్, డీఎస్పీ జగన్నాథ రెడ్డి, పట్టణ సీఐ మహేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పాత బాలకృష్ణ, పిట్ల శ్రీధర్, స్పీకర్ పీఏ భగవాన్ రెడ్డి తదితరులు ఉన్నారు.