నిజామాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / బాన్సువాడ, ఎల్లారెడ్డి: సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అందరివాడని సీఎం కేసీఆర్ అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల కోసం చిన్న పిల్లాడిలా కొట్లాడుతారని తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు భవిష్యత్తులో ఎండడం అనేదే ఉండదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నాక నిజాంసాగర్‌లో నీళ్లులేని సమయంలో గోదావరి జలాలను తరలించుకునే అద్భుతమైన ఏర్పాటు జరిగిందన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమలలో బుధవారం వైభవంగా నిర్వహించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బాన్సువాడకు చేరుకున్న సీఎం దంపతులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం నేరుగా తిరుమల కొండపైకి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాతలు, పోచారం కుటుంబ సభ్యుల విరాళాలతో స్వామి వారికి చేయించిన రెండు కిలోల బంగారు కిరీటాన్ని వేద పండితులకు సీఎం దంపతులు అందించారు. అనంతరం స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కొండ దిగువన ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు హాజరై అశేష జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. బాన్సువాడ అభివృద్ధికి స్పీకర్ పోచారం చేస్తున్న కృషిని, ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని సీఎం కొనియాడారు. తాను ఉన్నంత వరకు బాన్సువాడకు సేవ చేయాల్సిందిగా పోచారం శ్రీనివాసరెడ్డిని కోరారు. తెలంగాణ తిరుమల అభివృద్ధికి రూ.7 కోట్లు, బాన్సువాడ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.
రైతు బిడ్డ పోచారం..
స్థానిక నాయకుడు, ఈ మట్టిలో పుట్టి పెరిగిన బిడ్డ పోచారం శ్రీనివాసరెడ్డి అని, ఆయనకు వీరు, వారు అనే భేదం ఉండదని ముఖ్యమంత్రి అన్నారు. ఆత్మీయత గల వ్యక్తి పోచారం అని అభివర్ణించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం చిన్న పిల్లాడిలా కొట్లాడుతారని చెప్పారు. స్పీకర్ హోదాను మరిచి వినయంగా, విధేయతగా బాన్సువాడకు శ్రీనన్న సేవ చేస్తున్నాడని ప్రశంసించారు. ‘వయస్సు పెరుగుతున్నదని శ్రీనన్న అంటున్నారు. నేను కూడా ముసలోడ్ని అవుతున్నా. నాక్కూడ 69 ఏళ్లు వచ్చినాయి. నేను ఉన్నన్ని రోజులు మీరు ఉండాల్సిందే. బాన్సువాడకు సేవ చేయాల్సిందేనని’ కేసీఆర్ స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. ‘మీ మాట బలంగా ఉంటుంది. మీకు ఎవరితోనైనా మాట్లాడి పనులు చేయించుకునే గొప్పతనం ఉంది. నిజాయితీగా ప్రజల కోసం పాటుపడే వ్యక్తి మీరు. బాన్సువాడ ప్రజలకు సేవ చేయాల’ని సభాపతిని కోరారు. తాను సాధించిన ప్రగతిని బస్సులో గుట్టపైకి వచ్చేటప్పుడు పోచారం గర్వంగా, సంతోషంగా వివరించారన్నారు. శ్రీనన్నపై ఉన్న ఆదరాభిమానాలతో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు. ఈ పైసలతో బాన్సువాడ అభివృద్ధి కోసం దేనికైనా ఖర్చు పెట్టుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు. భగవంతుడు తమ లాంటి వారితో పని చేయించుకుంటాడని, మ్యాన్ ప్రపొజల్స్… గాడ్ డిస్పోజెస్ అంటూ వ్యాఖ్యానించారు. భగవంతుడి దయ శ్రీనన్న మీద వచ్చింది. నన్ను పిలిపించుకుని ఆయనే పని చేయించుకున్నాడు. స్వామి కరుణ, దయ బాన్సువాడ మీదనే కాదు.. మొత్తం రాష్ట్రంపై ఉండాలని, పంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇప్పటి వరకు ఈ ఆలయానికి రూ.23 కోట్లు ఇచ్చాం. ఇంకా రూ.7కోట్లు ఇస్తామని పేర్కొన్నారు.
నిజాంసాగర్ ఎండదు..
సీఎం తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమ కాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు దుస్థితిపై తన అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు బయలుదేరినప్పుడు తనను కదిలించిన అనేక సంఘటనల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు దుస్థితి కూడా ఒకటని ముఖ్యమంత్రి తెలిపారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆయకట్టు రైతులకు జరిగే అన్యాయం కళ్లారా చూశానని చెప్పారు. వందేళ్ల క్రితం కట్టి నిజాంసాగర్ ప్రాజెక్టును నాటి పాలకులు నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్‌కు నీటి గోస తీరిందన్నారు. ఇక నుంచి నిజాంసాగర్ పచ్చగా ఉంటదని, ఆయకట్టు రైతులు రెండు పంటలు పండించుకుని సుభిక్షంగా ఉండాలని కోరారు. ఒకానొక సందర్భంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నా. నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ఏడు రోజులు కొద్ది మందితో కలిసి నిరాహార దీక్ష చేశారని గుర్తు చేశారు. సమైక్య పాలకుల ద్రోహం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు మునుపు మంజీర మీద 50 టీఎంసీలతో దేవనూర్ వద్ద ప్రాజెక్టు కట్టాలని ప్రతిపాదించారని, అది కాస్తా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత రద్దయ్యిందన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్టు కాస్తా 30 టీఎంసీలకు కుదించబడి సింగూర్ ప్రాజెక్టును కట్టారని వివరించారు. హైదరాబాద్‌కు మంచి నీళ్ల పేరిట సింగూర్ నీళ్లను ధారాదత్తం చేయడం ద్వారా ఆయకట్టు ఆగమైందన్నారు. అలాంటి ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఊపిరి పోసినట్లు వెల్లడించారు.